For Money

Business News

18 నెలల డీఏ ఇవ్వడం లేదు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన 18 నెలల డీఏ బకాయిల ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది కేంద్రం. కరోనా సమయంలో డీఏ పెంచినా… చెల్లింపులు చేయని విషయం తెలిసిందే. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు పెంచిన మూడు డీఏ బకాయిలను కేంద్రం ఇప్పటి వరకు ఉద్యోగులకు చెల్లించలేదు. రాజ్యసభ సభ్యుడు నరేన్‌ భాయ్‌ రతవా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 18 నెలల బకాయిలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. 2020లో వచ్చిన కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిందని, అదే సమయంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల నేపథ్యంలో డీఏ బకాయిలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు. లెవల్ 3 ఉద్యోగుల డీఏ బకాయిలు కనీసం రూ.11,880 నుంచి రూ.37,554 వరకు వచ్చే అవకాశం ఉంది. లెవల్ 13, లేవల్ 14 ఉద్యోగులకు కనీసం రూ.1,44,200 నుంచి రూ.2,15,900 వరకు డీఏ బకాయిలు వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా కేంద్రం నుంచి తీపి కబురు అందుతుందని భావించిన ఉద్యోగులకు, పెన్షన్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. పెంచిన డీఏలకు సంబంధించి పలు కార్మిక సంఘాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించాయని.. అయినా డీఏ/డీఆర్‌ విడుదల చేయడం కుదరదని మంత్రి తేల్చేశారు. డీఏ బకాయిల కింద ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కనీసం రూ. 34,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఇపుడు తేల్చి చెప్పింది.