For Money

Business News

డీజిల్‌పై కంపెనీలకు లాభాలు!

గత కొన్ని నెలలుగా తమకు నష్టాలు వచ్చాయని చెప్పిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇపుడు లాభాలు గడిస్తున్నాయి. విదేశీ స్టాక్‌ మార్కెట్‌ బ్రోకింగ్ సంస్థల విశ్లేషణల ప్రకారం ఇపుడు ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలకు డీజిల్‌పై లాభాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఒకదశలో బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్ ధర 126 డాలర్లకు కాగా… ఇపుడు 76 డాలర్లకు పడిపోయింది. కాని కంపెనీలు మాత్రం ఒక్క పైసా కూడా తగ్గించకుండా అదే ధరకు అమ్ముతూ వస్తున్నాయి. మరి నష్టాలు ఎందుకు వస్తున్నాయో? ఏ కంపెనీ చెప్పడం లేదు. మరోవైపు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రూడ్‌ ఆయిల్‌ ఏమౌతోందన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. బ్యారెల్‌ ఆయిల్ 60 డాలర్ల కంటే ఇంకా తక్కువ ధరకు భారత కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి అంత చవగ్గా చమురు దిగుమతి చేసుకుంటున్నా.. మార్కెట్‌లో ఎందుకు తగ్గించడం లేదన్న ప్రశ్న వస్తోంది. రష్యా నుంచి అత్యధిక ముడి చమురు ప్రైవేట్‌ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయని… భారత్‌లో రిఫైన్‌ చేసి అధిక ధరకు యూరప్‌ దేశాలకు అమ్ముకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. అసలు రష్యా నుంచి ప్రభుత్వ రంగ కంపెనీలు ఎంత క్రూడ్‌ దిగుమతి చేసుకున్నాయి? సగటు కొనుగోలు ధర ఎంత? అన్న అంశాలపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. మరోవైపు సాధారణ ప్రజలు మాత్రం అధిక ధరలతో పెట్రోల్‌, డీజిల్‌ను కొంటున్నారు.