‘టైమ్స్’ను ప్రశ్నిస్తున్న ఈడీ
దేశంలో నంబర్ వన్ మీడియా కంపెనీ అయిన టైమ్స్ గ్రూప్ ఇపుడు విదేశీ మారక ద్రవ్య నిబంధనల (ఫెమా) ఉల్లంఘనను ఆరోపణలను ఎదుర్కొంటోంది. బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్ సంస్థలతో ఈ గ్రూప్‌కు ఉన్న లింకులపై ఆ గ్రూప్ అధికారులను ప్రశ్నిస్తోంది. దాదాపు రూ.900 కోట్ల లావాదేవీల విషయంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుమానిస్తోంది. ఈ మేరకు టైమ్స్ మేనేజ్మెంట్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది. అనేక మీడియా సంస్థలతో పాటు ఎంటర్టైన్మెంట్ కంపెనీలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. టైమ్స్ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన బెనెట్, కాల్మన్ అండ్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శివకుమార్ సుందరంను కొన్ని వారాల నుంచి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయనతో పాటు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హిమాన్షు అగర్వాల్‌ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. దాదాపు రూ. 900 కోట్ల లావాదేవీలపై ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ అధికారులను మనీ లాండరింగ్ నిబంధనల ఉల్లంఘన కింద విచారించడం లేదని… ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద విచారిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని ఈడీ అధికారులు ధృవీకరించగా, టైమ్స్ యాజమాన్యం స్పందించలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.