For Money

Business News

సొంతంగా ఇన్సులిన్‌ తయారీ

తమ రాష్ట్రంలో మధుమేహంతో బాధపడుతున్నవారి కోసం సొంతంగా ఇన్సులిన్‌ను తయారు చేయాలని కాలిఫోర్నియా రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ ట్వీట్‌ చేశారు. ఇన్సులిన్‌ ధర అధికంగా ఉండటం వల్ల అనేక మంది మధ్య తరగతి ప్రజలు కూడా కొనలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సులిన్‌ అభివృద్ధికి 5కోట్ల డాలర్లు, తయారీ యూనిట్ కోసం మరో 5 కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మధుమేహంతో బాధపడుతున్నవారు ఇన్సులిన్‌ కోసం నెలకు 300 డాలర్ల నుంచి 500 డాలార్ల వరకు వ్యయం చేయాల్సి వస్తోందని, అంత ఖర్చు భరించడం కష్టం ఉందని ఆయన అన్నారు. దీంతో సొంతంగా తయారు చేయాలని రాష్ట్రం నిర్ణయించిందన్నారు. అమెరికాలో మధుమేహంతో బాధపడేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇలా ఇన్సులిన్‌ను సొంతంగా తయారు చేయాలని నిర్ణయించిన మొదటిరాష్ట్రం కాలిఫోర్నియా. న్యూసోమ్‌ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రానికి అవసరమైన ఔషధాలను సొంతంగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. CalRx పేరుతో ఇన్సులిన్‌ను కాలిఫోర్నియా తయారు చేయనుందిన ఇటీవల లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇవే కాకుండా అత్యంత ఖరీదైన లేదా సరిపడా సరఫరా లేని ఔషధాలను సొంతంగా తయారు చేయాలని కాలిఫోర్నియా రాష్ట్రం భావిస్తోంది.