ఇక ఈఎంఐల బాదుడు షురూ…
ఆర్బీఐ రెపో రేటును పెంచకముందే అనేక బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను పెంచడం ద్వారా ఈఎంఐల భారాన్ని పెంచాయి. అనేక బ్యాంకులు నేరుగా రుణాలపై వడ్డీ రేటును పెంచాయి. వచ్చే నెల నుంచి వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచుతుందని, పైగా పావు శాతం మాత్రమే పెంచుతుందని భావిస్తున్న తరుణంలో 0.4 శాతం పెంచడంతో ఇంటి, వాహనాలతో పాటు ఇతర రుణాలపై వడ్డీ రేట్లు భారీగా పెరిగే అవకాశముంది. రెపో రేటు పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో … ఈ నెల నుంచే వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచనున్నాయి. వంటనూనెలతో పాటు ఎరువుల ధరలు భారీగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణ రేటు 17 నెలల గరిష్ఠానికి చేరిందని ఆర్బీఐ అంటోంది. ఇన్నాళ్ళూ ఆర్థిక వృద్ధిరేటు దెబ్బతినకుండా ఉండేందుకని… వడ్డీ రేట్లు పెంచలేదు. ఇపుడు ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయంలో వడ్డీ రేట్లు పెరిగాయి. వంటనూనెలు, ఎరువుల ధరలు పెరగకుండా నియంత్రణలు ఎత్తివేసిన ప్రభుత్వం ఇపుడు వడ్దీ రేట్లను పెంచింది. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుతుందేమో చూడాలి. ఈలోగా EMIలు మాత్రం పెరగడం ఖాయం. బ్యాంకుల వద్ద భారీగా నిధులు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. మరి వడ్డీ రేట్లు పెంచకుండా లేదా స్వల్పంగా పెంచి ఖాతాదారులను ఆదుకుంటారేమో చూడాలి.