For Money

Business News

ఎన్నారై మెడికల్ కాలేజీపై ఈడీ దాడులు

గుంటూరులోని ఎన్నారై మెడికల్‌ కాలేజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడి వీరు అటు ఎన్నారై మెడికల్‌ కాలేజీతో పాటు ఇటు అక్కినేని ఉమెన్స్‌ హాస్పిటల్‌పై దాడులు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్‌ ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కాలేజీని ప్రముఖ పారిశ్రామిక వేత్త మెగా కృష్ణా రెడ్డి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్‌ ఎంత కుదిరిందనే అంశంపై భిన్న కథనాలు వినిపిస్తున్నారు. పలు మీడియా సంస్థలు ఈ కాలేజీని రూ. 650 కోట్లకు మెగా కృష్ణారెడ్డి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. రూ. 2000 కోట్ల విలువైన మెడికల్‌ కాలేజీని రూ. 200 కోట్లకే కొన్నారని కూడా సామాజిక మీడియాలో కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. 250 ఎంబీబీఎస్, 150 పీజీ సీట్లు ఉన్న ఎన్నారై కళాశాలకు మంచి పేరు కూడా ఉంది. ఈ కాలేజీలో పలువురు ఎన్నారైలు కూడా యజమానులుగా ఉన్నారు. కొనుగోలు సమయంలో వీరి వాటాకు సంబంధించిన మొత్తం అనధికారికంగా విదేశాల్లో చెల్లించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్‌ జరిగిందని గతంలోనే ఈ కాలేజీ డీల్‌పై ఫిర్యాదులు వచ్చాయి. కోవిడ్ సమయంలో అధిక ఫీజులు వసూలు చేశారన్న ఆరోపణలపై పలు హాస్పిటల్‌లో ఐటీ అధికారులు కూడా దాడులు నిర్వహిస్తున్నారు.