ఈడీ ఎదుట కనికారెడ్డి
ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట ఇవాళ కనికారెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి భార్య అయిన కనికా రెడ్డి జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ అనే కంపెనీని నిర్వహిస్తున్నారు. మద్యం కేసులో ఈ కంపెనీ పాత్ర గురించి కనికా రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం కుంభకోణంలో చేతులు మారిన నగదు కనికా రెడ్డికి చెందిన జెట్‌సెట్ గో విమానాల ద్వారా రవాణా అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె ఈ కంపెనీని 2014లో నెలకొల్పారు. అప్పటి నుంచి కంపెనీ వివరాలు, కంపెనీ నడిపిన విమాన సర్వీసులు, అందులో ప్రయాణించినవారి వివరాలను ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈడీ సమీకరించింది. ఈ వివరాలకు సంబంధించి మరింత వివరణ కనికా రెడ్డి నుంచి ఈడీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీ పెట్టబడులపై కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన దాల్మియా భారత్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దాల్మియా, మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ కూడా జెట్ సెట్ గో ఏవియేషన్‌లో పెట్టుబడి పెట్టారు.