For Money

Business News

8 ఏళ్ళ గరిష్ఠానికి క్రూడ్‌ ఆయిల్

మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత తొలిసారి క్రూడ్‌ ఆయిల్‌ ఆల్‌టైమ్‌ హైకి చేరింది. 2014 స్థాయిని దాటి క్రూడ్‌ ముందుకు సాగుతోంది. తాజా సమాచారం మేరకు ఫ్యూచర్స్‌లో క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 87 డాలర్లను దాటడానికి సిద్ధంగా ఉంది. కొద్దిసేపటి క్రితం 86.97 డాలర్లను తాకింది. కోవిడ్‌ ముఖ్యంగా ఒమైక్రాన్‌ వల్ల పెద్ద ఇబ్బందులు లేవని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయిల్‌ డిమాండ్‌ మరింత పెరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ వడ్డీ రేట్లను తగ్గించి… లక్షల కోట్ల డాలర్లను ప్రింట్‌ చేశాయి. దీంతో ఇపుడు ధరలు పెరిగి వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికాతో పాటు భారత్‌లో కూడా వడ్డీ రేట్లు పెంచడానికి రంగం సిద్ధమైంది. సరిగ్గా ఇదే సమయంలో చైనా నుంచి ఆయిల్‌ మార్కెట్‌కు సానుకూల సంకేతాలు వచ్చాయి. ఇటీవల రియల్‌ ఎస్టేట్‌, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌తోపాలు రంగాల్లో సంస్కరణలు తెచ్చి… వాటి మార్కెట్‌ విలువ భారీగా పతనమయ్యేలా చైనా చేసింది. దీంతో చైనాలో వాతావరణం డల్‌గా మారింది. జీడీపీ 4 శాతం వృద్ధి ఉంటుందని అంచనాలు వస్తున్నారు. దీంతో గత రెండేళ్ళలో మొదటిసారిగా చైనా వడ్డీ రేట్లను తగ్గించింది. అంటే చైనాలో ఇంకా భారీగా డిమాండ్‌ పెరగనుందన్నమాట. ఆయిల్‌ సరఫరాపై ఒపెక్‌ నియంత్రణ కొనసాగుతోంది. వెరశి క్రూడ్‌ ధరలు తగ్గే పరిస్థితి కన్పించడం లేదు.