For Money

Business News

భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిస్టింగ్‌!

తన అనుబంధ సంస్థ అయిన భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ (BCCL)ను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ చేయాలని కోల్‌ ఇండియా నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు మార్చి 10వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కోల్‌ ఇండియా వెల్లడించింది. బొగ్గు శాఖ సలహా మేరకు BCCLలో 25 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఈ కంపెనీని లిస్ట్‌ చేయాలని నిర్ణయించింది. తదుపరి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తరవాత ఈ లిస్టింగ్‌ ప్రక్రియ ప్రారంభమౌతుందని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఎల్‌ 246.6 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఈ కంపెనీ నికర టర్నోవర్‌ రూ. 6149 కోట్లు కాగా, అంత క్రితం ఏడాది టర్నోవర్‌ రూ. 8967 కోట్లు. అమ్మకాలు భారీగా తగ్గడం వల్ల లాభం తగ్గి నష్టాల్లోకి వెళ్ళింది. దీంతో ఆ ఏడాది రూ. 1577 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. పన్ను ముందు రూ. 9991 కోట్ల లాభం ఆర్జించింది.1971లో ఈ బీసీసీఎల్‌ను కోల్‌ ఇండియా టేకోవర్‌ చేసింది. ఈ కంపెనీకి ఉన్న బొగ్గు గనులు ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి.