చైనా మార్కెట్లలో కరోనా కలకలం
కరోనా కేసులు కేవలం 3,500లోపే కావొచ్చు. కాని ప్రభుత్వం మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. దేశంలో అతి పెద్ద స్టార్టప్ సిటీ, హైటెక్ సిటీ అయిన షెన్జెన్ను పూర్తిగా మూసేసింది. ఈ నగరంలో 1000 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 1.75 కోట్ల జనాభా ఉన్న ఈ నగరాన్ని మూసివేయడం దేశ వాణిజ్య కార్యకలాపాలకు విఘాతంగా మారింది. అయినా చైనా లాక్‌డౌన్‌కే మొగ్గు చూపింది. మరోవైపు రష్యా, ఉత్తర కొరియాకు సరిహద్దులో ఉన్న 2.4 కోట్ల జిలిన్ ప్రావిన్స్‌లో కూడా ఆంక్షలు విధించింది. పూర్తి లాక్డౌన్ అమలు చేస్తోంది. దీంతో చైనా కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అనేక కంపెనీలు మూసివేయడం, తెరచి ఉన్న కంపెనీలకు ముడి పదార్థాల కొరత కారణంగా వాణిజ్య కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో చైనాలోని ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలన్నీ మూడు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక హాంగ్‌కాంగ్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో హాంగ్‌సెంగ్ 3.55 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఒక దశలో ఈ సూచీ 5 శాతంపైగా పడిపోయింది.దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడనుంది.