For Money

Business News

2,500 మంది ఉద్యోగుల తొలగింపు

ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఊహించిన స్థాయిలో వ్యాపారాలు లేకపోవడంతో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వంతో భారీ డీల్‌ కుదుర్చుకున్న బైజూస్‌ సంస్థ తమ గ్రూప్‌ కంపెనీల నుంచి 2500 మంది ఉద్యోగులను తొలగించింది. తాము ఉద్యోగులను తొలగించిన మాట నిజమేనని, అయితే ఈ తొలగింపు వల్ల 500 మందిపైనే ప్రభావం చూపుతుందని బైజూస్‌ పేర్కొంది. బైజూస్‌కు చెందిన వైట్‌ హాట్‌ జూనియర్‌, టాపర్‌ సంస్థల నుంచి భారీగా ఉద్యోగులను తొలగించారు. ఒక్క టాపర్‌ కంపెనీ ఏకంగా 1100 మందిని తొలగిచింది. కేవలం ఫోన్‌ చేసి తమను ఉద్యోగంలో నుంచి తీసేశారని ఉద్యోగులు ఆరోపించారు. గత సోమవారం కంపెనీ ఉద్యోగులు ఫోన్‌ చేసి… ఆఫీసుకు వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేయమని చెప్పారని, లేదంటే తామే తొలగిస్తామని కంపెనీ ఉద్యోగులు పేర్కొన్నారు. వైట్‌హ్యాట్‌ జూనియర్‌ కంపెనీ కూడా 900 మందిని తొలగించింది. దీంతో చాలా మంది ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.
ఆర్థిక ఇబ్బందులు…
బైజూస్‌ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. కంపెనీ విస్తరణ కోసం అనేక కంపెనీలను బైజూస్‌ టేకోవర్‌ చేస్తూ వచ్చింది. అలాగే గత ఏడాది ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ మంచి పేరున్న ఆకాష్‌ విద్యా సంస్థను టేకోవర్‌ చేసింది. ఈ డీల్‌ కింద 100 కోట్ల డాలర్లు అంటే రూ. 7800 కోట్లు చెల్లిస్తామని పేర్కొంది. ఆ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కూడా జరిగింది. అయితే ఆకాష్‌కు నిధులు ఇవ్వడంలో బైజూస్‌ విఫలమైనట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.