For Money

Business News

రిలయన్స్‌కు చావుదెబ్బ

ప్రధానిగా మోడీ పదవీ బాధ్యలు చేపట్టిన తరవాత అదానీ గ్రూప్‌ ప్రస్థానం అందరికీ తెలిసిందే. దేశంలో అత్యంత ఐశ్వరవంతుడిగా అదానీ ఎదిగారు. ఇపుడు మళ్ళీ ముకేష్‌ అంబానీ నంబర్‌ వన్‌ స్థానంలోకి వచ్చారు… కాని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఘోరంగా దెబ్బతీసింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని మీడియాలో వార్తలు వస్తున్నా… ఇంత త్వరగా ఉంటుందని ఊహించలేదు. ఇవాళ్టి నుంచి భారత్‌లోని రిఫైనరీలన్నీ తాము రిఫైన్‌ చేసిన ఆయిల్‌ను 50 శాతం దేశీయ మార్కెట్‌లో అమ్మాలని కేంద్రం ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి క్రూడ్‌ తెచ్చి… దాన్ని పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌గా మార్చి దిగుమతి చేస్తున్న కంపెనీలకు చావుదెబ్బ తీసే నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చౌకగా ముడి చమురు దిగుమతి చేసుకుని… దాన్ని పెట్రోల్‌, డీజిల్‌గా మార్చి యూరప్‌, ఇతర మార్కెట్లకు రిలయన్స్‌ సరఫరా చేస్తోంది. అలాగే కెయిర్న్‌ (వేదాంత) కూడా. ఇక నుంచి ఇలా విదేశాల నుంచి క్రూడ్‌ తెచ్చి రిఫైన్‌ చేసిన తరవాత ఎగుమతి చేసే ప్రతి లీటర్‌ డీజిల్‌పై రూ. 13, ప్రతి లీటర్‌ పెట్రోల్‌పై రూ. 6 ఎక్సైజ్‌ సుంకం చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసిన క్రూడ్‌ ఆయిల్‌పై కూడా టన్నుకు రూ. 23,230ల పన్ను విధించింది. ఈ దెబ్బకు రిలయన్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ఏకంగా ఏడు శాతం క్షీణించింది. ఇపుడు కోలుకుని 5.36 శాతం నష్టంతో రూ.2456 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీన రూ. 2856 ఉన్న రిలయన్స్‌ షేర్‌ కేవలం రెండు నెలల్లో రూ. 2456కి పడిపోయింది. ఓఎన్‌జీసీ షేర్‌ పది శాతంపైగా క్షీణించింది. ఇక వేదాంత షేర్‌ ప్రస్తుతానికి పది శాతం క్షీణించి రూ. 206కు చేరింది. ఇపుడు కోలుకుని రూ. 213.75 వద్ద ట్రేడవుతోంది. మొత్తానికి దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం రానుంది.