షాకింగ్ : బైజూస్ అకౌంటింగ్ మోసం
ఇపుడు క్యాపిటల్ మార్కెట్లో బైజూస్ అకౌంటింగ్ మోసాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలను ఆడిట్ చేసేందుకు… ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ హాకిన్స్ అండ్ సెల్స్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఆలస్యంగా ఫలితాలను ప్రకటిస్తోంది బైజూస్. బైజాస్ తన స్టడీ మెటీరియల్‌ను విక్రయించేందుకు సిబ్బందిపై ఎలాంటి ఒత్తిడి తెస్తోంది… ప్రజలను ఎలా మోసం చేస్తోందో వివరించే ప్రత్యేక కథనాలు ఇటీవల ఇంగ్లిషు మీడియాలో వచ్చాయి. ఇపుడు డెలాయిట్ అభ్యంతరంపై బైజూస్ అకౌంటింగ్ పద్ధతులపైనే అనుమానాలు తలెత్తాయి. అకౌంటింగ్ మోసం అత్యంత కీలకమైన అంశం ఇవాళ వెల్లడైంది. దీర్ఘకాలిక ఒక స్టడీ మెటీరియల్‌ను అమ్మిన ఏడాదిలోనే ఆ స్టడీ మెటీరియల్ మొత్తం సొమ్ము అందినట్లు బైజూస్ తన ఖాతాల్లో చూపుతోంది. ఇలా చేయడం వల్ల భారీ లాభాలను చూపించి.. తన కంపెనీ వ్యాల్యూయేషన్ పెంచుకుంది. దీంతో అనేక పీఈ ఫండ్స్, విదేశీ ఇన్వెస్టర్లు భారీ ప్రీమియంతో ఈ కంపెనీలో షేర్లు కొన్నారు. ఇపుడు తాజాగా అకౌంటింగ్ మోసం బయటపడటంతో స్టాక్ మార్కెట్లో కూడా ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. ఉదాహరణకు మెడికల్ కోర్సులకు ప్రిపేరయ్యే విద్యార్థులు నీట్ మెటీరియల్‌ను కొంటారు. ఇది రెండేళ్ళ కోర్సు. విద్యార్థులు దీన్ని వాయిదాలలో కూడా కొనేసౌకర్యం ఉంది. అలాగే ఏడాది కోర్సు మెటీరియల్‌ను కూడా వాయిదాలలో చెల్లించవచ్చు. అయితే కంపెనీ మాత్రం… అమ్మిన వెంటనే … మొత్తం సొమ్ము వచ్చినట్లు ఖాతాలో చూపుతోంది. విద్యార్థుల తలిదండ్రులు మిగిలిన వాయిదాలు కట్టకపోతే? ఈ అంశంపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. అంటే రూ. 30000 కోర్సును మూడు వాయిదాల్లో చెల్లించేందుకు విద్యార్థి తలిదండ్రులు అంగీకరిస్తే… కంపెనీ తన ఖాతాల్లో రూ. 30,000 వచ్చేసినట్లు చూపుతోంది. కాని వాస్తవంగా అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం ఎంత కచ్చిత మొత్తం కంపెనీ ఖాతాలోకి వస్తుందో అదే చూపాలి. ఈ పద్ధతిని డెలాయిట్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. డెలాయిట్ మరో మార్పును కూడా సూచించినట్లు తెలుస్తోంది. కంపెనీ తాజా మార్పులకు అంగీకరించడంతో 2020-21 ఆర్థిక ఫలితాలు దారుణంగా ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంటున్నారు. ఈ వ్యవహారంతో మొత్తం బైజూస్ అకౌంటింగ్ పద్ధతులపైనే అనుమానం కల్గిస్తోంది. ఈ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై ఇపుడు అనుమానాలు ప్రారంభమౌతున్నాయి.