For Money

Business News

రూ. 50,000లోపు స్టాండర్డ్‌ గోల్డ్‌!

అంతర్జాతీయ మార్కెట్లను అమెరికా మాంద్యం వార్తలు కుదిపేస్తున్నాయి. ఇవాళ జేపీ మోర్గాన్‌, మోర్గాన్‌ స్టాన్లీ సంస్థలు నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించాయి. దీంతో అమెరికా ఫ్యూచర్స్‌ ఒకటిన్నర శాతంపైగా నష్టపోయాయి. యూరో మార్కెట్లు ఇప్పటికే ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అనేక సంస్థల ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండే అవకాశముందని… ఫెడరల్ రిజర్వ్‌ మరింత భారీగా వీలైతే ఒక శాతం మేర వడ్డీ రేట్లను పెంచవచ్చన వార్తలు అన్ని మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. క్రూడ్‌ ఆయిల్‌ రెండు శాతంపైగా పెరిగింది. 108ని దాటిన డాలర్‌ ఇండెక్స్‌ 109 దిశగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో బులియన్‌ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఇపుడు యూరప్‌ మార్కెట్లలో ఔన్స్‌ బంగారం ధర 1707 డాలర్లకు చేరింది. బంగారం రెండు శాతం క్షీణిస్తే వెండి అయిదు శాతంపైగా క్షీణించి 18.422 డాలర్లకు పడిపోయింది. మన దేశంలో డాలర్‌ రూపాయి స్థిరంగా ఉన్న పతనం భారీగా లేదు. తాజా సమాచారం మేరకు ఎంసీఎక్స్ మార్కెట్‌లో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ఆగస్టు కాంట్రాక్ట్‌ రూ.50,275ని తాకింది. ఇక వెండి ధర కూడా మన మార్కెట్‌లో రెండున్నర శాతంపైగా పడింది. ఆగస్టు కాంట్రాక్ట్‌ రూ. 56,158ని తాకింది. మరి అమెరికా మార్కెట్ల ప్రారంభం తరవాత అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1700 డాలర్లకు దిగువకు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈనెలలో స్టాండర్డ్‌ బంగారం రూ. 49000 తాకినా ఆశ్చర్యపోన్కర్లేదని బులియన్‌ మార్కెట్‌ అనలిస్టులు అంటున్నారు.