For Money

Business News

ఎయిర్‌టెల్‌లోకి కీలక భాగస్వామి?

కొత్త వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ను ఎయిర్‌ టెల్‌ తీసుకు రానుందా? ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల కేటాయింపు ద్వారా వ్యూహాత్మక పెట్టుబడిదారుడిని బోర్డులోకి తీసుకు వచ్చే యోచన భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ ప్రమోటర్లకు ఉందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఈనెల 28వ తేదీన జరిగే బోర్డు సమావేశంలో దీనిని కంపెనీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ పీటీఐ వార్తా సంస్థ రాసింది. కంపెనీ యొక్క దీర్ఘకాలిక వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాత్మక భాగస్వామిని బోర్డులో తీసుకు వచ్చేందుకు కంపెనీ మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి కంపెనీకి పెద్దగా ఆర్థికంగా ఇబ్బందులు లేవు. అలాగే ఒత్తిడి కూడా ఏమీ లేదు. అయినా దీర్ఘకాలికంగా పోటీ తట్టుకోవడంతో పాటు.. మరిన్ని లక్ష్యాల సాధనకు వ్యూహాత్మక పెట్టుబడిదారునిపై కంపెనీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30, 2021 నాటికి కంపెనీకి నికర రుణాలు దాదాపు రూ. 1.66 లక్షల కోట్లు. అయితే ఇటీవల పూర్తి చేసిన రైట్స్‌ ఇష్యూలో భాగంగా మరో కాల్‌కు సంబంధించిన రూ. 15700 కోట్లు నెలలో కంపెనీ చేతికి రానున్నాయి. అలాగే ఇటీవల కంపెనీ టారిఫ్‌ను బాగా పెంచింది. దీని వల్ల కూడా కంపెనీ ఆదాయం బాగా పెరగనుంది. సమీప భవిష్యత్తులో 5జీ కోసం కంపెనీ నిధులు పెట్టాల్సిన పని కూడా లేదు. ఇప్పటికైతే కంపెనీకి నిధుల సమస్య లేదని, అయితే వ్యూహాత్మక భాగస్వామి కోసం ఎయిర్‌టెల్‌ యోచిస్తోందని కంపెనీ వర్గాలు అంటున్నాయి.