For Money

Business News

స్టాక్‌ మార్కెట్‌లో మరో భారీ స్కామ్‌

ఆ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.3 లక్షల కోట్ల రూపాయలను మేనేజ్‌ చేస్తుంది. అనేక బ్లూచిప్‌ కంపెనీల షేర్లు ఆ ఫండ్‌ చేతిలో ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ నిబంధనలకు విరుద్ధం ఆ ఫండ్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఫ్రంట్‌ రన్నర్స్‌గా పనిచేసినట్లు తేలింది. స్టాక్‌మార్కెట్‌ బ్రోకర్ల నుంచి ఫిర్యాదు రావడంతో గత ఫిబ్రవరి నుంచే ఆ మ్యూచువల్‌ ఫండ్‌ అంతర్గతంగా విచారణ జరిపింది. స్కామ్ నిజమేనని తేలడంతో ఇద్దరిని ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ఇపుడు ఆ వ్యవహారం మీడియాకు లీకైంది. రకరకాల ఊహాగానాలు బయటికి రావడంతో ఆ ఫండ్‌ స్వయంగా ఓ ప్రకటన జారీ చేసింది. తాము బయటి ఆడిటర్ల సాయంతో మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని… మార్కెట్‌లో వచ్చే వదంతులను నమ్మవద్దని పేర్కొంది. ఇంత జరిగినా.. ఆ ఫండ్‌ ఈ స్కామ్‌ ఏమిటో చెప్పలేదు. ఏం జరిగింది? ఎలా జరిగిందో చెప్పలేదు. దీంతో మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో అనేక కథనాలు వైరల్‌ అవుతున్నాయి. లక్షల కోట్ల నిధులను మేనేజ్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్‌ తన ఉద్యోగులు స్కామ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయని తెలియగానే ఎందుకు మార్కెట్‌ వెల్లడించలేదనేదే తొలి ప్రశ్న. రెండు నెలలు ఈ సమాచారాన్ని ఫండ్‌ ఎలా తొక్కిపెట్టిందని ఇపుడు స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఆ ఫండ్‌ వద్ద షేర్లు ఇవాళ మార్కెట్‌లో అయిదు నుంచి పది శాతం కుప్పకూలాయి. ఇంతకీ ఆ ఫండ్‌ ఏదంటే…
అంత రహస్యమా?
తమ కంపెనీ ఉద్యోగులైన వీరేష్‌ జోషి, దీపక్‌ అగర్వాల్‌లను తమ స్కీమ్‌ల మేనేజ్మెంట్‌ నుంచి తొలగిస్తున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ మ్యూచువల్ ఫండ్‌ వెల్లడించింది.వీరేష్‌ జోషి ఫండ్‌ మేనేజర్‌… ఆయన ఏకంగా అయిదు స్కీములు మేనేజ్‌ చేస్తున్నారు. దీపక్‌ అగర్వాల్‌ అసిస్టెంట్‌ పండ్‌ మేనేజర్‌ (ఈక్విటీ). వీరికి ఇక నుంచి యాక్సిస్‌ కన్జమ్షన్‌ ఈటీఎఫ్, యాక్సిస్‌ క్వాంట్‌ ఫండ్‌, యాక్సిస్‌ వ్యాల్యూ ఫండ్‌తో సంబంధం లేదని యాక్సిస్‌ మ్యూచుఫల్‌ ఫండ్‌ వెల్లడించింది. అంతకుమించి మ్యూచువల్‌ ఫండ్‌ వివరాలు వెల్లడించలేదు. దీంతో మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. సస్పెండ్ అయిన ఇద్దరు ఉద్యోగులు ఫ్రంట్‌ రన్నర్స్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఫ్రంట్‌ రన్నర్స్‌ అంటే మ్యూచువల్‌ ఫండ్‌ దగ్గర ఏయే షేర్లు ఎన్ని ఉన్నాయి? వేటిని ఎపుడు కొంటారు? ఎపుడు అమ్ముతారో బ్రోకర్లకు ముందే చెప్పడం. దీంతో బ్రోకర్‌ ఫండ్‌ కదలికలను బట్టి షేర్లలో ట్రేడ్‌ చేసి వందల కోట్లు సంపాదిస్తారు. మార్కెట్‌లో ఉన్న ధర కంటే అధిక ధరకు షేర్లను యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు చెందిన అధికారులు కొనడం కొంత మంది బ్రోకర్లు గుర్తించారు. దీన్ని ఫండ్‌ అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో ఈ విచారణ మొదలైంది. రెండు నెలల అంతర్గత విచారణ తరవాత ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేశారు. ఇందులో ఓ ఫండ్‌ మేనేజర్‌పై సోషల్‌ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ఫండ్ ఎండీ, సీఈఓతో కలిసి రూ.1000 కోట్ల స్కామ్ చేశారని కొందరు సోషల్‌ మీడియాలో ఆరోపిస్తున్నారు.ఓ ఫండ్‌ మేనేజర్‌ అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతాడని, అతనికి లాంబర్గోని కారు కూడా ఉందని, ఉత్తర ముంబైలో పెద్ద ఫ్లాట్స్‌ ఉన్నాయని కూడా కొందరు ఆరోపిస్తున్నారు.
దెబ్బకు షేర్లు ఢమాల్‌
యాక్సిస్‌ బ్యాంక్‌ వద్ద ఏడు స్కీములు ఉన్నాయి. ఆరోపణలు రావడంతో రిడంప్షన్‌ అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నౌకరి, టోరెంట్ పవర్‌, కోఫోర్జ్‌, దివీస్‌ ల్యాబ్‌, డిమార్ట్‌ షేర్లు ఈ ఫండ్స్‌ వద్ద అధికంగా ఉన్నాయి. ఈ షేర్లన్నీ ఇవాళ అయిదు శాతం నుంచి పది శాతం క్షీణించాయి. హైనెట్‌ వర్త్‌ ఇండివ్యూడువల్స్‌(HNIs) ఇప్పటికే ఈ షేర్ల నుంచి బయటపడినట్లు సమాచారం. రెండు నెలల క్రితం ఆరోపణలు రావడం, విచారణ ప్రారంభం కావడంతో… ఈ విషయం మార్కెట్‌లో ‘పెద్దవాళ్ళ’కు తెలిసింది. దీంతో వారు ముందుగానే ఈ కౌంటర్ల నుంచి బయటపడ్డారు. ఇపుడు సాధారణ ఇన్వెస్టర్‌ రోడ్డున పడ్డారు.
షేర్ల పతనం..
కోఫోర్జ్‌ – 7 శాతం
నౌకరి – 6 శాతం
దివీస్‌ -5 శాతం
టోరెంట్ పవర్‌ – 6 శాతం
డీమార్ట్‌ – 6 శాతం.. ఈ షేర్లతో పాటు ఇంకా నియోజెన్‌ కెమికల్స్‌, ఎస్‌జేఎస్‌ ఎంటర్‌ప్రైజస్‌, విజయా డయాగ్నస్టిక్స్‌, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌, అలికాన్‌ కాస్ట్‌అల్లాయ్‌, గో ఫ్యాషన్స్‌, అహ్లువాలియా కాంట్రాక్ట్స్‌ షేర్లు కూడా భారీగా ఉన్నాయి.