రూ.2,500 కోట్ల అప్పు చేసిన ఏపీ
ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ మరో 2500 కోట్ల రుణానికి అనుమతి తీసుకుని వచ్చారు. ఆర్ధిక శాఖ అధికారులు ఢిల్లీ చుట్టు అప్పుల కోసం తిరిగినా తప్పుడు లెక్కలు గ్రహించిన కేంద్రం అనుమతులు ఇచ్చేదికాదు. ఇప్పుడు ఎవరు వెళ్లినా కొత్త అప్పు పుట్టకపోయే సరికి నేరుగా ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగారు. సోమవారం ఆయన ఢిల్లీలో ప్రధాని మోదీని, ఆ తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. దీంతో రాత్రికిరాత్రే రూ.2,500కోట్ల కొత్త అప్పునకు అనుమతి వచ్చింది. తెల్లవారగానే… మంగళవారం ఆర్బీఐలో బాండ్లు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్రం రూ.2500కోట్లు అప్పు తెచ్చుకుంది. ఆర్థికశాఖ కార్యదర్శులు, ఆ శాఖ మంత్రి, వైసీపీ ఎంపీలు డిసెంబరు అంతా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా అప్పు పుట్టలేదు. దీంతో సీఎం జగన్ రంగంలోకి దిగారు. జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు కూడా ఖజానాలో చిల్లిగవ్వ లేదని ప్రధానికి, ఆర్థికమంత్రికి మొర పెట్టుకున్నారు. దీంతో కేంద్రం అప్పటికప్పుడు రూ.2,500 కోట్ల అప్పును ఆపద్ధర్మంగా ఇచ్చింది. రాత్రి పొద్దుపోయాక అనుమతిరావడమే ఆలస్యం! రాత్రికి రాత్రే ఆర్బీఐకి ఇండెంట్ పెట్టుకున్నారు. తెల్లారి ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.2,500 కోట్లు ఒకేసారి అప్పు తెచ్చారు.