For Money

Business News

అదానీ బిడ్లు ర‌ద్దు.. ఏపీ షాక్‌

గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనని తేలింది.

దిగుమ‌తి బొగ్గు స‌ర‌ఫ‌రా చేసేందుకు అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ దాఖ‌లు చేసిన రెండు వేర్వేరు టెండ‌ర్లను ఏపీ ప్రభుత్వం ర‌ద్దు చేసింది. ఈ విషయాన్ని రాయిటర్స్‌ వార్త సంస్థ ధృవీకరించింది. అదానీ ఎంట‌ర్ ప్రైజెస్ పేర్కొన్న ధ‌ర‌లు చాలా ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఏపీ అధికారులు చెప్పిన‌ట్లు రాయిట‌ర్స్ తెలిపింది. అధిక ధ‌ర‌ల పేరిట ఇలా బిడ్లను ఒక రాష్ట్ర ప్రభుత్వం ర‌ద్దు చేయ‌డం ఇటీవ‌లి కాలంలో ఇదే తొలిసారి. దిగుమతి బొగ్గు కావాలంటూ ఏపీ ప్రభుత్వం ఆహ్వానించిన టెండర్లకు అదానీ గ్రూప్‌ స్పందించింది. దక్షిణాఫ్రికా నుంచి దిగుమ‌తి చేసుకున్న ఐదు ల‌క్షల ట‌న్నుల బొగ్గును స‌ర‌ఫ‌రా చేస్తామని పేర్కొంది. అయితే ట‌న్నుకు రూ.40 వేలు (526.50 డాల‌ర్లు) చొప్పున ధ‌ర కోట్ చేసింది. గ‌త జ‌న‌వ‌రిలో రూ.17,480 (230.08 డాల‌ర్లు)ల‌కు మ‌రో 7.5 ల‌క్షల ట‌న్నుల స‌ర‌ఫ‌రాకు అదానీ గ్రూప్ బిడ్ చేసింది.
ఈ టెండర్‌కు అదానీ గ్రూప్‌తోపాటు అగ‌ర్వాల్ కోల్ కూడా బిడ్ వేసింది. ఈ రెండు సంస్థలు అధిక ధ‌ర‌లు కోట్ చేశాయ‌ని ఏపీ అధికారులు చెప్పారు. ఖరీదైన బొగ్గు దిగుమతి చేసుకోవడానికి ఏపీ వెనుకాడుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రానికి కొత్త భారం భరించలేదని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్‌ విద్యుత్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం 1500 కోట్ల బకాయిలు ఉన్న నేపథ్యంలో ఖరీదైన బొగ్గుతో పరిస్థితి మరింత జటిలం కావొచ్చని భావిస్తోంది. దక్షిణాఫ్రికా బొగ్గు గత జనవరిలో టన్ను 176.5 డాలర్లు ఉండగా, మార్చి నెలలో 441.65 డాలర్లకు చేరింది. అదానీ కంపెనీ 526.5 డాలర్లకు సరఫరా చేస్తానంటోంది.