జియోకు పోటీగా ఎయిర్‌టెల్ ఫోన్!
రిలయన్స్ జియో నెక్ట్స్ ఫోన్‌కు పోటీగా 4జీ స్మార్ట్ ఫోన్ తేవాలని ఎయిర్‌టెల్ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచినట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఎయిర్ టెల్ కోసం స్మార్ట్‌ఫోన్లు తయారు చేసేందుకు లావా, కార్బన్, హెచ్‌డీ గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే రిలయన్స్ కంపెనీ మాదిరిగా సబ్సిడీలు, ఇతర ఆఫర్‌లతో నిమిత్తం లేకుండా తన ఫోన్‌ను తక్కువ ధరకు ఆఫర్ చేయాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. జియో నెక్ట్స్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ కోసం ఎయిర్‌టెల్ కూడా ఎదురు చూస్తోంది. ఎయిర్‌టెల్‌కు 12 కోట్ల మంది 2జీ సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. వీరు జియో వైపు వెళ్ళకుండా ఎయిర్‌టెల్ వ్యూహం పన్నుతోంది. చిప్‌సెట్స్ కొరత తీవ్రంగా ఉన్న సమయంలో తక్కువ ధరకు భారీ సంఖ్యలో ఫోన్లను అందించడం రిలయన్స్ కూడా కష్టమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి టెలికాం మార్కెట్‌లో పోటీ తీవ్రమౌతోంది.