నిరాశపర్చిన ఎయిర్టెల్
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్టెల్ కంపెనీ మార్కెట్ అంచనాలను అందుకోవడంలోవిఫలమైంది. ఈ త్రైమాసికంలో రూ. 34527 కోట్ల టర్నోవర్ పై రూ.2145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభం 89 శాతం పెరగ్గా, టర్నోవర్ 22 శాతం పెరిగింది. ఈటీ నౌ ఛానల్ నిర్వహించిన సర్వేలో కంపెనీ రూ. 34130 కోట్ల టర్నోవర్, రూ. 2372 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. టర్నోవర్ విషయంలో టార్గెట్‌ను సాధించినా… నికర లాభం మాత్రం మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 33.5 శాతం, టర్నోవర్ 5.3 శాతం మాత్రమే పెరిగింది. ఒక యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం సైతం (ARPU) రూ.183 నుంచి రూ.190కి పెరిగినట్లు ఎయిర్టెల్ తెలిపింది. రిలయన్స్ ARPU గడచిన మూడు నెలల్లో 0.8 శాతం పెరగ్గా, ఎయిర్టెల్ 3.6 శాతం మేర పెంచుకుంది. కొత్త వినియోగదారుల విషయంలో కూడా కంపెనీ పనితీరు నిరాశాజనకంగా ఉంది. ఈ మూడు నెలల్లో రిలయన్స జియో కొత్త సబ్స్క్రయిబర్ల సంఖ్య 77 లక్షలు కాగా, ఎయిర్‌టెల్‌కు కొత్త 4.9 లక్షల మంది మాత్రమే అదనంగా చేరారు. కంపెనీ అప్పులు రూ. 1.57 లక్షల కోట్లకు చేరింది.