నేటి నుంచి ఎన్‌డీటీవీ ఓపెన్ ఆఫర్
ఎన్‌డీటీవీలో అదనపు వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది . షేరుకి రూ . 294 ధర చెల్లించేందుకు ఈ ఆఫర్ చేయనుంది అదానీ గ్రూప్. పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఈ ఆఫర్ ఉద్దేశించారు. ఇందుకు దాదాపు రూ . 493 కోట్లు వెచ్చించనుంది. ఆఫర్ ఈ డిసెంబర్ 5న ముగియనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల 7న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు అనుమతించింది. దశాబ్దం క్రితం వీసీపీఎల్ అనే సంస్థ ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు రూ .400 కోట్ల రుణాలివ్వడం ద్వారా వారంట్లను పొందింది. వీసీపీఎల్‌ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్ వీటిని ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించింది. దీంతో ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటాను హస్తగతం చేసుకుంది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ షేరు నిన్న బీఎస్ఈలో 5 శాతం తగ్గి రూ. 382 వద్ద ముగిసింది. ఈ ధరతో పోల్చినా… ఓపెన్ ఆఫర్ ధర 23 శాతం తక్కువ!