ఏడాదిలో 70 శాతం పెరిగిన వంట నూనెల ధర
సన్ ఫ్లవర్ ఆయిల్ 2019 ఫిబ్రవరిలో లీటరు రూ. 98 ఉండేది. ఇపుడు బ్రాండ్‌నుబట్టి రూ. 180 నుంచి రూ. 280 మధ్య ఉంటోంది. ఇక వంటనూనెల విషయానికొస్తే ఏడాదిలో వీటి ధరలు 70 శాతం పెరగ్గా, నెల రోజుల్లో అంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరవాత 20 నుంచి 30 శాతం పెరిగాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ కొరత తీర్చేందుకు ప్రభుత్వం రష్యా నుంచి 45000 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందు టన్ను సన్ ఫ్లవర్ ఆయిల్ ధర 1630 డాలర్లు ఉండగా, ఇపుడు 2150 డాలర్ల ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ నూనె దిగుమతి కానుంది. ఇతర నూనెల విషయం వేరు, సన్ ఫ్లవర్ ఆయిల్ తీరు వేరని వ్యాపార వేత్తలు అంటున్నారు. ఇతర నూనెలు వాడేవారు ఏదో ఒక నూనెతో సర్దుకుపోతారు, కాని సన్‌ఫ్లవర్ వినియోగదారులు మారరని అంటున్నారు. ఈ నూనె నెలకు లక్ష టన్నుల అవసరమౌతుందని వీరు అంటున్నారు. ఉక్రెయిన్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు ప్రసిద్ధి. కాని ఈ ఏడాది యుద్ధం కారణంగా సగం పంట మాత్రమే రావొచ్చని భావిస్తున్నారు.