గోధుమ రైతు పంట పండింది
గత ఏడాది రైతు ఉద్యమం కారణంగా అనేక ఇబ్బందులు పడ్డ ఉత్తరాది రైతులు ముఖ్యంగా గోధుమ రైతులు ఇపుడు లాభాల్లో మునిగి తేలుతున్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వం గోధుమలకు కనీస మద్దతు ధర (MSP) ప్రకటించినా… చాలా వరకు రైతులు తమ పంటను తక్కువ ధరకే ఓపెన్ మార్కెట్లలో అమ్ముతుంటారు. లక్ష్యం మేరకు మాత్రమే ప్రభుత్వం గోధుమలను సేకరిస్తుంది. మిగిలిన పంటను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటారు రైతులు. గత ఏడాది ఏప్రిల్‌లో క్వింటాల్ గోధుమలను రూ. 1,600లకు కూడా రైతులు అమ్ముకున్నారు. గత ఏడాది గోధుమ ఎంఎస్పీ రూ.1,975. అంటే ఎంఎస్పీ కన్నా 15 శాతం తక్కువ ధరకు పంటను అమ్ముకున్నారన్నమాట. ఈ ఏడాది ఎంఎస్పీని రూ.2,015కు పెంచింది. అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో గోధుమలకు డిమాండ్ భారీగా పెరిగింది. రష్యా, ఉక్రెయిన్ నుంచి గోధుమల సరఫరాకు ఆటంకాలు ఏర్పడటం. ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో 30 శాతం ఈ రెండు దేశాలే పండిస్తాయి. ఉక్రెయిల్‌లో ఈసారి రైతుల్లో కొందరు దేశం విడిచి వెళ్ళిపోయారు. మరికొందరు సైన్యంలో చేరారు. పంట పండించే పరిస్థితి లేదు. అలాగే నల్లసముద్రం ద్వారా ఓడల రవాణా తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా రష్యా ఓడలను పంపడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడి…ధర దాదాపు రెట్టింపు అయింది. ఈ ఏడాది ఆరంభంలో 210 డాలర్లు ఉన్న టన్ను గోధమ ధర ఇపుడు 402 డాలర్లు పలుకుతోంది. దీంతో మన గోధుమలకు డిమాండ్ ఏర్పడింది. టన్నుకు రూ.2,400 నుంచి రూ. 2,500 వరకు లభిస్తోంది. గత ఏడాది కనిష్ఠ ధరలతో పోలిస్తే ఇది 50 శాతం ఎక్కువ.
రీటైల్ మార్కెట్లో…
ఆఫ్రికా దేశాలు చాలా వరకు రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునేవి. ఇపుడు భారత్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా గోధుమలు పండించే దేశాల్లో మనది రెండోస్థానం. ఈ ఏడాది గోధుమ ఎగుమతులు 70 లక్షల టన్నులు దాటుతాయని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 66 లక్షల టన్నులు గోధుమలు ఎగుమతి చేశారు. కొత్త పంట చేతికి రావడంతో ఈ నెల 15 నుంచి ఎగుమతి చేయడం ప్రారంభమౌతుంది. ఎగుమతులు భారీగా పెరగడంతో దేశీయంగా కూడా గోధుమల ధరలు పెరిగాయి. ముఖ్యంగా షర్బతీ గోధుమ పిండి బ్రాండ్‌ను బట్టి రూ. 4,000 నుంచి రూ. 5,000 వరకు పలుకుతోంది. ఆర్గానిక్ షర్బతీ గోధుమల ధర రూ. 6,000 దాటుతోంది.