For Money

Business News

కొత్త అప్పుల్లో 33 శాతం వడ్డీకే

తెలంగాణ రాష్ట్రం వివిధ పద్దుల కింద వసూళ్ళు బాగా చేస్తున్నా… కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో గ్రాంట్లు రాకపోవడంతో అధిక అప్పులు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ నాటికి అంటే 9 నెలలకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.39,069 కోట్లు కాగా… అదే సమయంలో వడ్డీల కింద చెల్లించిన సొమ్ము రూ.13,520 కోట్లకు చేరింది. అంటే కొత్త అప్పుల్లో మూడో వంతు వడ్డీలకు సరిపోతోంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులైన సేల్స్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌ వసూళ్ళత పాటు కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్‌ టార్గెట్‌లో 71 శాతం నుంచి 75 శాతం వరకు సాధించినట్లు కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. జీఎస్టీ వసూళ్ళు కూడా టార్గెట్‌లో 66 శాతానికి చేరింది. మొత్తానికి రెవెన్యూ వసూళ్ళ టార్గెట్‌ దాదాపు 70 శాతం సాధించింది. అయితే కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్ల విషయంలో గట్టి దెబ్బ పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 38,669 కోట్లు గ్రాంట్‌, ఇతర పథకాలకు సాయంగా వస్తుందని ఆశించగా, 9 నెలల్లో అందిన మొత్తం కేవలం రూ.6,373 కోట్లు మాత్రమే. రాష్ట్ర బడ్జెట్‌ టార్గెట్‌లో ఇది 16 శాతమే. అయితే రెవెన్యూ మేనేజ్‌మెంట్‌లో కేసీఆర్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడంతో రెవెన్యూ లోటు బడ్జెట్‌లో పేర్కొన్నదానికి దాదాపు రెట్టింపు (188 శాతం) అయింది. అదే ఏపీలో రెవెన్యూ లోటు 918 శాతానికి చేరిన విషయం తెలిసిందే. చిత్రమేమిటంటే… ప్రస్తుత బడ్జెట్‌లోరూ.57,930 కోట్లు గ్రాంట్‌, ఇతర పద్దతుల కింద సాయం అందుతుందని ఏపీ అంచనా వేసింది. డిసెంబర్‌ వరకే రూ.25,248 కోట్లు అంటే 44 శాతం వరకు గ్రాంట్లను పొందింది. తెలంగాణ మాత్రం 16 శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.