ఆంధ్రా నెత్తిన కర్ణాటక ‘పెట్రో’ బాంబు
(ForMoney Exclusive Story)
ఒక్క తెలంగాణ సరిహద్దు ప్రాంతం మినహాయిస్తే… ఇతర రాష్ట్రాల సరిహద్దులన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తలనొప్పిగా మారాయి. ఇప్పటి వరకు యానాం ఒక్కటే అనుకుంటే… తరవాత ఒడిశా కూడా చేరింది. తాజాగా కర్ణాటక పెద్ద బాంబే పేల్చింది. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించాక ఏపీలో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ. 110.71 కాగా, డీజిల్ ధర రూ. 96.58. పొరుగున ఉన్న యానాంలో పెట్రోల్ రేటు రూ. 95.59 కాగా, డీజిల్ రేటు రూ. 83.83. మరి యానాం నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పెట్రోల్, డీజిల్ దొంగ రవాణాకు ఛాన్స్ తక్కువ. కాని ఇందాక కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తీసుకున్న నిర్ణయం ఏపీకి పెద్ద తలొన్పిగా మారింది. మొత్తం రాయలసీమకు కర్ణాటక సరిహద్దు ఉంది. ఇక అంతర్ రాష్ట్ర సర్వీసులు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్లను గణనీయంగా తగ్గించింది. ఎక్సైజ్ సుంకంతో పాటు రాష్ట్రంలో కూడా వ్యాట్ తగ్గించింది. కేంద్రం డీజిల్‌పై రూ. 10 తగ్గిస్తే… ఆ తగ్గింపుతో పాటు ఆటోమేటిగ్గా వ్యాట్ కాస్త తగ్గుతుంది. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా లీటర్‌కు రూ. 7 తగ్గింది. దీంతో లీటరుకు తగ్గింపు రూ. 19.47కు చేరింది. అంటే ఇపుడు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో లీటర్ డీజిల్ రూ. 85.03కే లభిస్తుందన్నమాట. ఏపీలో డీజిల్ రేటు రూ.96.53. అంటే కర్ణాటకలో లీటర్ డీజిల్ రూ. 11.50 తక్కువన్నమాట. ఇక కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధరను రూ. 13.30 తగ్గించారు. దీంతో కర్ణాటకలో ధర రూ. 100.63 కాగా,ఏపీలో ధర రూ.110.71. కర్ణాటకలో ధర రూ. 10.12 తక్కువన్నమాట. మరి ఈ పరిస్థితుల్లో వ్యాట్‌పై ఏపీ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.