దరఖాస్తు చేయండి
కనోహర్ ఎలక్ట్రికల్స్ పబ్లిక్ ఆఫర్ తొలిరేజే సబ్‌స్క్రయిబ్ అయింది. ఎల్లుండి ఈ ఐపీఓ ముగియనుంది. మార్కెట్ నుంచి రూ. 1,055.74 కోట్ల సమీకరణకు కంపెనీ ప్రైమరీ మార్కెట్ వస్తోంది. ఇందులో రూ. 300 కోట్ల విలువైన 47.47 లక్షల షేర్ల తాజా ఇష్యూ కింద జారీ చేయనుంది. మిగిలిన రూ. 755.74 కోట్లకు సమానమైన 1.20 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద అమ్మనుంది. రూ. 755 కోట్లు ప్రస్తుత ప్రమోటర్లు లేదా ఇన్వెస్టర్లకు వెళతాయి. ఇష్యూ ధరల శ్రేణఙ రూ. 601–రూ. 632 అంటే ఒక లాట్ లాట్ సైజు 23 షేర్లు అన్నమాట. ఈనెల 16వ తేదీన ఈ కంపెనీ షేర్లు NSE, BSEలలో లిస్ట్ కానుంది.
ప్రస్తుతం అనధికార మార్కెట్‌లో ఈ షేర్ రూ. 196 ప్రీమియంతో ట్రేడవుతోంది. అంటే లిస్టింగ్ లాభాలు ఉంటాయన్నమాట.
ట్రాన్స్‌మిషన్, రైల్వేలకు ఈ కంపెనీ ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేస్తోంది. కంపెనీకి యూపీలో మీరట్ వద్ద రెండు తయారీ యూనిట్లు ఉన్నాయి. వీటి మొత్తం ట్రాన్స్‌ఫార్మర్ తయారీ సామర్థ్యం మార్చి 31, 2026 నాటికి 19,200 MVAలు. కంపెనీ ఆదాయం FY25లో రూ. 457.30 కోట్లు కాగా, FY26లో రూ. 662.86 కోట్లకు పెరిగింది. అలాగే కంపెనీ నికర లాభం (PAT) కూడా రెట్టింపై, రూ. 65.12 కోట్ల నుంచి రూ. 129.73 కోట్లకు చేరింది. ట్రాన్స్‌ఫార్మర్ తయారీతో పాటు EPC సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. 100 MVA, 132 kV స్కాట్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీకి RDSO ధృవీకరణ పొందిన కేవలం నాలుగు భారత తయారీదారుల్లో ఈ కంపెనీ ఒకటి.
పబ్లిక్ ఆఫర్ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 64.18 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయనుంది. మరో రూ. 155 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగిస్తుందని ప్రమోటర్లు అంటున్నారు. దేశంలో విద్యుత్ రంగం పునరుద్ధరణ ప్రాజెక్టులు జెట్ స్పీడ్‌తో అమలు అవుతున్నాయి. అలాగే రైల్వే వ్యవస్థ కూడా మెరుగవుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఉత్పత్తులకు మున్ముందు కూడా మంచి డిమాండ్ అవకాశముంది. కాబట్టి ఈ ఇష్యూకు ఇన్వెస్టర్లు సబ్‌స్క్రయిబ్ చేయొచ్చు. లిస్టింగ్ లాభాలు స్వల్పంగా ఉన్నా… దీర్ఘకాలానికి మంచి ప్రతిఫలాలు అందించే అవకాశముంది.
