For Money

Business News

హెరిటేజ్‌కు రూ. 59 కోట్ల ప్రోత్సాహకాలు

తిరుపతి సమీపంలో చంద్రగిరిలో ఉన్న ప్రస్తుత మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ రూ. 209.68 కోట్లతో అప్‌గ్రెడేషన్‌ (విస్తరణ) ప్రాజెక్టు చేపట్టింది. 2024-29 ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ కింద పలు ప్రోత్సహకాలు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉపాధి కల్పనతో పాటు విస్తరణ చేపట్టే ప్రాజెక్టులకు ఈ పాలసీ కింద ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. దీని కింద హెరిటేజ్‌ ఫుడ్స్‌ పెట్టుకున్న దరఖాస్తును స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ ఫిబ్రవరి 12న ఆమోదం తెలిపింది. దీని ఆధారంగా ఫిబ్రవరి 18న భేటీ అయిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) కూడా ఈ ప్రోత్సహకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో హెరిటేజ్‌కు వివిధ ప్రోత్సాహకాల కింద రూ. 59.69 కోట్లను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. విస్తరణ ప్రాజెక్టు పూర్తి అయిన తరవాత అయిదేళ్ళలో ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఇవాళ జారీ చేసిన జీవో ప్రకారం టెక్నాలజీ అప్‌గ్రడేషన్‌ కింద 25 శాతం సబ్సిడీ అంటే రూ. 34.93 కోట్లు, రాష్ట్రంలోనే తయారై, అమ్మిన వస్తువులపై వసూలు చేసే జీఎస్టీని వెనక్కి చెల్లించే పద్దు కింద రూ. 17.80 కోట్ల వరకు చెల్లిస్తారు. ఇక విద్యుత్‌ చార్జీల రీ ఎంబర్స్‌మెంట్‌ కింద రూ. 0.98 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు కింద రూ.0.98 కోట్లు, AHIDFలాగా వడ్డీ సబ్సిడీ కింద మరో రూ. 5 కోట్లు చెల్లిస్తారు. ఇవన్నీ కూడా విస్తరణ ప్రాజెక్టు పూర్తయిన తరవాత ఇస్తారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో చేపట్టే ఏ కంపెనీ ప్రాజెక్టులకైనా ప్రభుత్వం ఈ పాలసీ కింద ప్రోత్సాహకాలు ఇస్తుంది.