For Money

Business News

ఇక ఫ్లెక్సి రుణాలు కష్టమా?

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు నిన్న ఆర్బీఐ జారీ చేసిన నమూనా మార్గదర్శకాలు ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇప్పటి వరకు సులభంగా బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థల నుంచి రుణాలు పొందిన వారికి మున్ముందు ఇబ్బందులు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలు కేవలం నమూనా మాత్రమేనని, ఈనెల 28 వరకు సంబంధిత సంస్థలు ఆర్బీఐకి తమ అభిప్రాయాలు తెలియజేస్తాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. చర్చల తరవాత ఖరారు అయ్యే నిబంధనలు మాత్రమే 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇపుడున్న నిబంధనల మేరకు ఒక వ్యక్తి NBFC నుంచి క్రెడిట్‌ లిమిట్‌ పొందిన తరవాత… ఆ మేరకు ఎన్నిసార్లయినా రుణం తీసుకోవచ్చు. తిరిగి చెల్లించి.. మళ్ళీ రుణం తీసుకోవచ్చు. లిమిట్‌తో సంబంధం లేకుండా, మీరు ఎంత బకాయి ఉన్నారో అంత మొత్తానికే వడ్డీ చెల్లించే అవకాశముంది. దీన్నే ఫ్లెక్సి క్రెడిట్‌ ప్రొడక్ట్స్‌ అంటారు. వీటిని బ్యాంకులు, NBFCలు అందిస్తున్నాయి. ఈ రంగంలో బజాజ్‌ ఫైనాన్స్‌ ముందుంది. అయితే నిన్న ఆర్బీఐ జారీ చేసిన నిబంధనల మేరకు ఒకసారి క్రెడిట్‌ లిమిటెడ్‌ను నిర్ణీత కాలవ్యవధికి మాత్రమే ఇవ్వాలి. అంటే టర్మ్‌ లోన్‌ మాదిరిగా మాత్రమే. కస్టమర్‌ రుణం చెల్లించిన తరవాత మళ్ళీ అదే క్రెడిట్‌ లిమిట్‌ ఇవ్వరాదు. దీంతో NBFCల వ్యాపారం దెబ్బతినే అవకాశముంది. అయితే కొత్త ఆంక్షల నుంచి ఆర్బీఐ నుంచి ఆమోదం పొందిన ఎస్‌బీఐ కార్డ్స్‌ వంటి సంస్థలకు మినహాయింపు ఇచ్చారు. అలాగే బుల్లెట్‌ రీపేమెంట్‌ లోన్లకు కూడా మినహాయించారు. దీనిని ప్రైవేట్‌ NBFCలు వ్యతిరేకించే అవకాశముంది. ఆర్బీఐతో దీనిపై చర్చించే అవకాశముంది. కాస్త వెసులుబాటుతో తుది నిబంధనలు ఖరారు కావొచ్చని NBFCలు ఆశిస్తున్నాయి. లేకున్నా… మరో మార్గాన్ని ఈ కంపెనీలు అన్వేషించే అవకాశముంది. వివిధ రకాల ప్రొడక్ట్స్‌ను అందించడంలో ముందే NBFCలకు ఆర్బీఐ తాజా నిబంధనలు పెద్దగా అవరోధం కాకపోవచ్చని అనలిస్టులు భావిస్తున్నాయి. ఆర్బీఐ తాజా చర్చలతో శుక్రవారం బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ ఏకంగా 6 శాతం క్షీణించగా, దాని మాతృ సంస్థ బాజజ్‌ ఫిన్‌సర్వ్‌ 4 శాతంపైగా నష్టపోయింది. చోళమండళం మూడున్నర శాతం, టాటా క్యాపిటల్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, జియో ఫైనాన్స్‌, ఏబీ క్యాపిటల్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్ షేర్లు రెండు శాతంపైగా నష్టంతో ముగిశాయి. NBFCలకు ఇలాంటి ఆదేశాలు కొత్త కాదని, ఎప్పటికపుడు కొత్త స్కీములతో తమ వ్యాపారాన్ని కాపాడుకుంటాయని అనలిస్టులు అంటున్నారు. ప్రస్తుత స్థాయిల్లో ఈ షేర్లను కొనే అంశాన్ని పరిశీలించవచ్చని వీరు సూచిస్తున్నారు.

Leave a Reply