For Money

Business News

వర్మ కంపెనీకి భూమి, రాయితీలు

పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకు చెందిన కంపెనీకి భూమితో పాటు పలు రాయితీలు ఇస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడలో తాజ్‌ బ్రాండ్‌ పేరుతో వర్మకు చెందిన SVS కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ కన్వెన్షన్‌ సెంటర్‌ కమ్‌ 5 స్టార్‌ హోటల్‌ కట్టనుంది. ఈ పెట్టుబడి ప్రతిపాదనకు గత ఏడాది అక్టోబర్‌ 7వ తేదీన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలిపింది. రూ. 104 కోట్లతో కట్టే ఈ ప్రాజెక్టుకు ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు కూడా ఆమోదం తెలిపింది. వీటికి కేబినెట్‌ కూడా సరే అనడంతో ఇవాళ రాష్ట్ర టూరిజం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 300 మందికి ఉపాధి అవకాశాలు ప్రాజెక్టు కల్గించే ప్రాజెక్టుకు ఏపీ టూరిజం పాలసీ కింద పలు ప్రోత్సాహకాలతో పాటు భూమిని కూడా కేటాయిస్తున్నారు. ఈ పాలసీ కింద వర్మ కంపెనీకి కాకినాడలో ప్రభుత్వం 3.4 ఎకరాల భూమిని కేటాయిస్తుంది. తగిన భూమిని జిల్లా అధికారులతో కలిసి ఏపీ టూరిజం అథారిటీ ఎంపిక చేస్తుంది. సంస్థ సీఈఓ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. 66 ఏళ్ళకు ఇచ్చే లీజుకు ఇస్తూ మరో 33 ఏళ్ళు పొడిగించే వెసులుబాటు కూడా జీఓలో పెట్టారు. ఒక లీజు మొత్తం SRO విలువలో ఒక శాతం ఉంటుంది. ప్రతి మూడు ఏళ్ళకు 5 శాతం చొప్పున పెంచుతారు. ఏడీపీ కూడా కంపెనీ స్థూల ఆదాయంలో ఒక శాతం ఉంటుంది. తొలి పదేళ్ళ పాటు వసూలు చేసిన స్టేట్‌ జీఎస్టీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఫిక్సెడ్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ. 10 కోట్లకు పరిమితం చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీని అయిదేళ్ళ పాటు తిరిగి ఇచ్చేస్తారు. కంపెనీ సింగిల్‌విండో ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తరవాతనే ప్రాపర్టీ ట్యాక్స్‌, వాటర్‌ సప్లయ్‌చార్జీలు, సేవరేజ్‌ చార్జీలు వసూలు చేస్తారు. 2014లో పిఠాపురం నుంచి తెలుగుదేశం నుంచి గెలిచిన వర్మ గత ఎన్నికల్లో తన సీటును జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు త్యాగం చేశారు. అలాగు ఇపుడు టూరిజం శాఖ కూడా జనసేనకు చెందిన కందుల దుర్గేష్‌ వద్ద ఉండటం విశేషం. దీంతో ఇవాళ వర్మ కంపెనీకి ఇచ్చిన అనుమతులు ఇపుడు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.