For Money

Business News

H1-B వీసా ఫీజు: కోర్టుకు రాష్ట్రాలు

H1-B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. కాలిఫోర్నియాతో కలిసి మొత్తం 20 రాష్ట్రాలు కోర్టులో కేసు వేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ పేర్కొంది. మసాచుసెట్స్ ఫెడరల్‌ కోర్టులో ఈ రాష్ట్రాలు కోర్టులో పిటీషన్‌ వేశాయి. H1-B వీసా ఫీజును పెంచడం వల్ల ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు వంటి సంస్థలు తీవ్రంగా నష్టపోతాయని ఈ రాష్ట్రాలు వాదిస్తున్నాయి. కీలక రంగాల్లో ఇప్పటికే సిబ్బంది కొరత ఉందని, ట్రంప్‌ తాజా నిర్ణయంతో ఈ సమస్య మరింత పెరుగుతుందని కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ రాబ్‌ బొంత అంటున్నారు. ఈ ఫీజును విధించే అధికారం ట్రంప్‌ ప్రభుత్వానికి లేదని, ఇది అమెరికా రాజ్యాంగాన్ని, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్‌ను ఉల్లంఘించడమేనని రాష్ట్రాలు తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. ప్రస్తుతం హెచ్‌-1బీ వీసా కోసం 960 డాల‌ర్ల నుంచి 7,595 డాల‌ర్ల వరకు మాత్రమే ఫీజులు వసూలు చేస్తుండగా, దీన్ని లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. పిటీషన్‌ వేసిన రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, మసాచుసెట్స్ సహా న్యూయార్క్, న్యూజెర్సీ, హువాయి, మేరిల్యాండ్‌, మిచిగాన్‌, మిన్నెసోటా, నార్త్‌ కరోలియనా, ఒరెగాన్‌, రోడ్‌ ఐల్యాండ్‌, వెర్మాంట్‌, వాషింగ్టన్‌, విస్కాన్‌సిన్‌, డేలావేర్‌, కనెక్టకిట్‌, కొలరాడా రాష్ట్రాలు ఉన్నాయి.