కోర్టు ఆదేశాలను ఏపీ సీఐడీ ధిక్కరిస్తోంది
మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారుల దుష్ప్రచారం కొనసాగుతోంది. మార్గదర్శి సంస్థకు సంబంధించి తరచూ మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలు చేయడాన్ని కోర్టులు తప్పు పట్టినా… ఏపీ సీఐడీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇవాళ మరో పత్రికా ప్రకటన జారీ చేశారు. తమ నుంచి నోటీసులు అందినవారు సీఐడీ అధికారుల వద్ద హాజరై.. తాము చిట్ ఫండ్‌లో డిపాజిట్ చేసిన మొత్తానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరింది. పత్రికా ప్రకటనలో ఆర్బీఐ పేరు ప్రస్తావించింది. ఒకవైపు కోర్టుల్లో కేసులు నడుస్తుండగా.. కోర్టు ఆంక్షలు ఉన్నా… ఏపీ సీఐడీ అధికారులు తరచూ పత్రికా ప్రకటనలు జారీ చేయడంపై మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ చందాదారుల్లో భయాందోళనలను కల్గించే దురుద్దేశంతోనే ఇలాంటి ప్రకటనలు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏపీ సీఐడీ అధికారులు జారీ చేసిన పత్రికా ప్రకటనలోని అంశాలను ఖండిస్తూ మార్గదర్శి సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
కోర్టు ఆదేశాల ధిక్కరణ
తమ సంస్థ చందాదారుల గోప్యత అంశంలో జోక్యం చేసుకోకూడదని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు సూచించినా.. ఈ విషయంలో కోర్టు వారి ఉత్తర్వులను నిర్లక్ష్యం చేస్తూ ఏపీ సీఐడీ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు మార్గదర్శి ఆరోపించింది. మార్గదర్శి సంస్థను అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా పదే పదే ప్రెస్ నోట్స్ విడుదల చేస్తున్నారని ఆరోపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లందరినీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ వ్యాపారానికి భారీ ఎత్తున నష్టం కలిగించేలా ఏపీ సీఐడీ చర్యలు ఉన్నాయని… ఇదంతా పెద్ద కుట్రలో భాగమేనని పేర్కొంది. తమ సంస్థ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఏపీ సీఐడీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్న ఆరోపణలన్నీ పూర్తిగా కల్పితాలేనని మార్గదర్శి స్పష్టం చేసింది. ఈ ఆరోపణలకు ఎటువంటి అర్హతలు లేవని తెలిపింది.
చిట్ ఫండ్స్ చట్టం, ఆదాయపు పన్ను చట్టంతో పాటు చిట్ ఫండ్ వ్యాపారాలను నియంత్రించే ఏ నిబంధనను తాము ఎక్కడా ఉల్లంఘించలేదని మార్గదర్శి స్పష్టం చేసింది. తమ చిట్ ఫండ్ కంపెనీపై చందాదారులకు అచంచలమైన విశ్వాసం, నమ్మకం ఉన్నాయని.. అందుకు తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని మార్గదర్శి పేర్కొంది. చిట్ ఫండ్ వ్యాపారం కోసం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగానే కంపెనీ తమ వ్యాపారాన్ని నిబద్దతతో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. తమ చందాదారులందరినీ భయాందోళనలకు గురిచేసే విధంగా… వారి వ్యక్తిగత వివరాల కోసం పట్టుబట్టి ఏపీ సీఐడీ అధికారులు వేధిస్తున్నారని తెలిపింది. తమ వ్యాపారాన్ని, కస్టమర్ నెట్ వర్క్‌ను దెబ్బతీసే దురుద్దేశాలతో ఏపీ సీఐడీ విచారణలను కొనసాగిస్తోందని మార్గదర్శి ఆరోపించింది.