రూ. 2000 నోటు బంద్
చెలామణి నుంచి రూ. 2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. ఇక మార్కెట్లోకి కొత్తగా రూ.2000 నోట్లను విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఆర్బీఐ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అలాగే కస్టమర్లకు రూ. 2000 నోటును ఇవ్వొదని బ్యాంకులకు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి రానుంది. మార్కెట్లో ఉన్న రూ. 2000 నోటు మాత్రం చెలామణి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. తాజా నిర్ణయం వల్ల ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. ఈనెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కస్టమర్లు తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకుల వద్ద డిపాజిట్ చేయొచ్చని లేదా వాటికి బదులు ఇతర నోట్లను తీసుకోవచ్చని పేర్కొంది. అయితే రోజుకు గరిష్ఠంగా రూ. 20,000 విలువైన రూ. 2000 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు అనుమతించారు. అంటే పది నోట్లను మాత్రమే జమ చేయాల్సి ఉంటుంది. లేదా ఇతర నోట్లను తీసుకోవచ్చు. బ్యాంకులతో పాటు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా ఈ సౌకర్యం ఉంటుందని పేర్కొంది. మార్చి 31 నాటికి జారీ చేసిన రూ.2000 నోట్లలో 10.8 శాతం మాత్రమే జనం వద్ద చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. 2016 నవంబరులో రూ. 2000 నోటును ప్రవేశ పెట్టిన ఆర్బీఐ…2018-19 నుంచే వీటి ప్రింటింగ్‌ను నిలిపివేసింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో వచ్చే సెప్టెంబర్ నెలాఖరు తరవాత రూ. 2000 నోట్లను పూర్తిగా ఉపసంహరించినట్లు అవుతుంది.