For Money

Business News

స్మగ్లర్‌తో బంధాలేమిటో‌… ఈడీకే పిచ్చెక్కిస్తున్న లింకులు

ఇవాళ కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గుట్కా డాన్‌ అభిషేక్‌ ఆవలను విచారించనుంది. అకస్మాతుగా అభిషేక్‌ను ఎందుకు పిలిచారు? మళ్ళీ ఇవాళ ఎందుకు పిలుస్తున్నారు? ఇతనికి ఎమ్మెల్యే రోహిత్‌ సోదరుడికి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ.7.7 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు మీడియాకు లీకు కూడా ఇచ్చారు. రోహిత్‌ తరఫున అతని సోదరుడు ఏదైనా డీల్స్‌ చేస్తున్నాడా? సోదరుడు డీల్‌ చేస్తే అభిషేక్‌ ఎందుకు వచ్చాడు? ఈ అభిషేక్‌ ఎవరో కాదు…ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రధాన నిందుల్లో ఒకడైన నందకుమార్‌ వ్యాపార భాగస్వామి. వీరిద్దరితో రోహిత్‌ రెడ్డికి లింకులు ఉన్నాయా అని విచారిస్తున్న ఈడీకి మరో లింక్‌ దొరికింది. అదేమిటంటే… కల్వకుంట్ల తేజస్వర్‌ రావు అనే వ్యక్తి కూడా వీరికి వ్యాపార భాగస్వామి. ఈయన ఎవరో కాదు. స్వయంగా సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు. ఈముగ్గురు లింకులకంటే ముందు…ఈ అభిషేక్‌ సంగతి చూద్దాం. ఎందుకంటే బేగం బజార్‌లో అభిషేక్‌ ఆవాల అంటే అందరికీ తెలుసు? ఎలాగంటే.. గుట్కా స్మగ్లర్‌గా. ఇతని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే… హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ పోలీసులు లేదా అతని రికార్డు కావాలంటే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో దొరుకుతుంది. మరీ వెతనక్కర్లేదు. 2019లో నమోదైన కేసు. గుజరాత్‌ నుంచి రూ.1.5 కోట్ల విలువైన గుట్కా, పాన్‌మసాలా, చూయింగ్‌ టొబాకొ ప్యాకెట్లు స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డాడు అభిషేక్‌ ఆవల. సినిమాల్లో చూపినట్లు ఇతను కూడా ఓ సుమారుపాటి స్మగ్లర్‌. బేగంబజార్‌లో అభిషేక్‌కు ఓ షాఫు ఉంది అభిషేక్‌కు. మాణిక్‌చంద్‌ గుట్కాలను ఇతను డిస్ట్రిబ్యూట్‌ చేసేవాడు. సినిమాల్లో చూపినట్లు ఇతను కూడా తాను సరఫరా చేసే మాణిక్‌చంద్‌ గుట్కాను స్టడీ చేసి.. పక్కా ప్లాన్‌తో తనే తయారు చేయాలని అనుకున్నాడు. అసలు కంపెనీకి ఎగనామం పెట్టి… తనే యాదాద్రిలో ఓ గుట్కా తయారీ కేంద్రం పెట్టాడు. ‘7హిల్స్‌ మాణిక్‌ చంద్‌’ పేరుతో తన సొంత బ్రాండ్‌ను తయారు చేసి అమ్మేవాడు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అమ్మడానికి ఏజెంట్లను నియమిస్తున్నట్లు చాలా మంది నుంచి అడ్వాన్స్‌లు తీసుకుని ఎగ్గొట్టాడు. వీళ్ళను కూడా మోసం చేశాడు. ఆ కేసులూ ఉన్నాయి. గుట్కాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అయినా యాదాద్రిలో యూనిట్‌ నడిపించాడు అభిషేక్‌. కాని 2018లో దీన్ని గుర్తించిన పోలీసులు కేసు పెట్టి.. యూనిట్‌కు తాళం వేశారు. దీంతో మరో ప్లాన్‌ వేశాడు. గుట్కాకు అనుమతి ఉన్న గుజరాత్‌పై దృష్టి పెట్టాడు. అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌లలో గుట్కా తయారీ కేంద్రాన్ని పెట్టాడు. అక్కడి నుంచి రైళ్ళ ద్వారా, వ్యాన్‌ల ద్వారా గుట్కాను అక్రమంగా రవాణా చేసేవాడు. అలాగే అక్రమంగా హైదరాబాద్‌కు తెచ్చి సబ్‌ డీలర్లకు అమ్మేవాడు. మొత్తానికి ఎవరో ఈ స్మగ్లింగ్‌ గురించి పోలీసుల చెవిన పడేశారు. 2019 మేలో పోలీసులు అతన్ని రూ. 1.5 కోట్ల విలువైన గుట్కా, పాన్‌మసాలాతో స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. ఇది జరిగింది 2019 మేలో. ఇంత పబ్లిగ్గా పోలీసులకు దొరికిన అభిషేక్‌కు ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడైన నందకుమార్‌ ప్రెండ్ అయ్యాడు. అదే ఏడాది అక్టోబర్‌లో నందకుమార్‌కు చెందిన W3 హాస్పిటాలిటి సర్వీసెస్‌లో డైరెక్టర్‌గా చేరాడు. వీరిద్దరి మధ్య బంధం మరింత ధృడం కావడంతో ఏకంగా గుట్కా కంపెనీల్లో నందకుమార్‌ డైరెక్టర్‌గా చేరాడు. ఇపుడు 7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ ప్రొడక్ట్స్‌, సెవెన్‌ హిల్స్‌ మార్కెటర్స్‌ అండ్‌ మాన్యూఫ్యారర్స్‌తో పాటు వే ఇండియా కార్పొరేషన్‌ ( VAY INDIA CORPORATION) ఇద్దరూ డైరెక్టర్లు. వే ఇండియా సినిమా రంగంలోకి కూడా ప్రవేశించింది.
సినిమా రంగంలోకి…
అభిషేక్‌ ఆవల, శ్రవంతి పాలగాని కలిసి ‘నీకూ నాకు రాసుంటే’ అనే సినిమాను కూడా నిర్మించే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ తరవాత ఆ సినిమా ఏమైందో తెలియదు. ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే… శ్రవంతి పాలగాని, అభిషేక్‌ ఆవల కలిసి మక్రా బేవరేజెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (MACAW BEVERAGES INDIA PRIVATE LIMITED) పేరుతో ఓ కంపెనీ కూడా పెట్టడం.
కల్వకుంట్ల లింక్‌….
నందకుమర్‌కు చెందిన W3 హాస్పిటాలిటీ సర్వీసెస్‌లో 2019లో అభిషేర్‌ చేరితే…2021 జులైలో కల్వకుంట్ల రాజేశ్వర్‌ రావు చేరారు. ఈయన ఎవరో కాదు. సీఎం కేసీఆర్‌ సోదరుడి కుమారుడు. అభిషేక్‌ బేరేజ్‌ కంపెనీని 2020లో పెట్టాడు. రాజేశ్వర్‌ రావు హాస్పిటాలిటీ కంపెనీలో చేరింది 2021లో. మరి మద్యం వ్యాపారంలో చేరేందుకు సాయంగా ఉంటారని రాజేశ్వర్‌ రావును డైరెక్టర్‌గా తీసుకున్నారా? అన్నది తేలాల్సి ఉంది.ఏదో కేసు విచారణకు రోహిత్‌ రెడ్డిని విచారిస్తే… ఇంకేవో లింకులు బయటపడ్డాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మద్యం స్కామ్‌… ఎమ్మెల్యేల ఎర కేసు… డ్రగ్‌ స్కామ్‌లలో… ఎవరెకవరి వెనుక ఎవరు ఉన్నారో తెలియక ఈడీ అధికారులు కూడా జట్టు పీక్కుంటున్నారు.