ఇకపై ఢిల్లీలో హైదరాబాద్ బిర్యానీ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ‘ఇంటర్సిటీ లెజెండ్స్’ పేరుతో మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు మనం ఉన్న ప్రాంతంలో దొరికే ఆహార పదార్థాలను మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది జొమాటొ. ఇక నుంచి ఇతర నగరాల్లోని ప్రముఖ హోటల్స్ ఫుడ్ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. ఇతర నగరాల నుంచి విమానాల ద్వారా ఈ ఫుడ్‌ను తెప్పిస్తామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పారు. పైగా ఆధునిక టెక్నాలజీ వాడటం వల్ల ఆహారాన్ని ఫ్రీజ్ చేయడం కాని లేదా ప్రిజర్వేటివ్స్‌ను వాడటం కాని ఉండదన్నారు. డెలివరీ తరవాత ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లు తినొచ్చిని ఆయన అన్నారు. ”కోల్‌కతా నుంచి రసగుల్లా, హైదరాబాద్ బిర్యానీ, బెంగళూరు నుంచి మైసూర్ పాక్, లక్నో నుంచి కబాబ్, ఓల్డ్ ఢిల్లీ నుంచి బటర్ చికెన్, జైపూర్ నుంచి ప్యాజ్ కచోరీ వంటి వంటకాలను ఆర్డర్ చేసుకోవచ్చని దీపిందర్ గోయల్ అన్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సర్వీస్‌ను గుర్గావ్, దక్షిణ ఢిల్లీ ప్రాంతాలకు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతాల్లోని కస్టమర్లు కోల్‌కతా, హైదరాబాద్,లక్నో, జైపూర్, బెంగళూరు, మథుర, చెన్నై, ఆగ్రా, భువనేశ్వర్ వంటి నగరాల నుంచి ఫుడ్‌ను జొమాటో ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చని అన్నారు. ఆయా నగరాల్లో కేవలం ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి మాత్రమే సరఫరా చేస్తామన్నారు. త్వరలోనే ఇతర నగరాలకు ‘ఇంటర్సిటీ లెజెండ్స్’ సర్వీస్‌ను విస్తరిస్తామని అన్నారు.