For Money

Business News

ప్రమోటర్లూ వెళ్ళిపోండి… జీ ఓనర్లకు షాక్‌

నిన్న డిష్‌ టీవీ. ఇపుడు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌. డిష్‌ టీవీలో ప్రధాన వాటాదారైన ఎస్‌ బ్యాంక్‌ ఇటీవల కంపెనీ ఛైర్మన్‌ జవహర్‌లాల్‌ గోయెల్‌ను రాజీనామా చేసి వెళ్ళిపోవాలని కోరింది. ఈ మేరకు బోర్డు మీటింగ్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇపుడు ఇదే సీన్‌ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కన్పిస్తోంది. ఈ కంపెనీలో ప్రధాన వాటా ఇన్వెస్కో అనే విదేశీ ఇన్వెస్టర్‌కు ఉంది. ఈ కంపెనీతో పాటు ఓఎఫ్‌ఐ గ్లోబల్‌ చైనా ఫండ్‌ ఎల్‌ఎల్‌సీ కూడా ప్రస్తుత డైరెక్టర్ల రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది. డిష్‌ టీవీలో సుభాష్‌ చంద్ర సోదరుడు జవహర్‌ లాల్‌ గోయెల్‌ ఛైర్మన్‌గా ఉండగా, జీ టీవీలో సుభాష్‌ చంద్ర కుమారుడు పునీత్‌ గోయెంకా ఛైర్మన్‌గా ఉన్నారు. పునీత్‌ గోయెంకాతో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లను రాజీనామా చేయాలని ప్రధాన ఇన్వెస్టర్లు కోరుతున్నారు. దీంతో మనీష్‌ చొకాని, అశోక్‌ కురియన్‌ కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. సుభాష్‌ చంద్రతో కలిసి మనీష్‌ చొకాని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీని నెలకొల్పారు. తాజా సమాచారం మేరకు మనీష్‌ చొకాని, అశోక్‌ కురియన్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మరి పునీత్‌ గోయెంకా కూడా రాజీనామా చేస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ఆయనకు కంపెనీలో కేవలం నాలుగు శాతం వాటా ఉంది. ఆయన రాజీనామా చేస్తే… జీ గ్రూప్‌లోని రెండు ప్రధాన కంపెనీలు… డిష్‌ టీవీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి సుభాష్‌ చంద్ర కుటుంబం పూర్తిగా వైదొలగినట్లే అవుతుంది.