For Money

Business News

ఓనర్లపై వేటు: జీ ఇన్వెస్టర్లకు పండుగ

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ నుంచి ప్రమోటర్‌ డైరెక్టర్లు రాజీనామా చేయాలంటూ రెండు ప్రధాన ఇన్వెస్టింగ్‌ సంస్థలు నోటీసు జారీ చేయడంతో… ఆ కంపెనీ వ్యవహారాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఇద్దరు డైరక్టర్లు ఇప్పటికే రాజీనామా చేయగా… కంపెనీ ప్రధాన ప్రమోటర్ సుభాష్‌ చంద్ర కుమారుడు పునీత్‌ గోయెంకా ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు. కంపెనీలో కేవలం నాలుగు శాతం వాటా ఉన్న ఆయన వైదొలగడం ఖాయమనే వార్తలు రావడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్‌ పరుగులు తీసింది. ఎక్స్ఛేంజీ నిబంధనల ప్రకారం తొలుత 20 శాతం పెరగ్గానే కొద్దిసేపు కూలింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. ఆ తరవాత కూడా పెరిగితే 5 శాతం పెరిగిన ప్రతిసారీ కూలింగ్ పీరియడ్‌ ఇస్తారు. ఇలా మొత్తం 40 శాతం పైగా పెరిగింది జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ ఇవాళ. నిన్న ఈ షేర్‌ రూ. 186.85 వద్ద క్లోజ్‌ కాగా ఇవాళ రూ. 270.80ని తాకిన తరవాత 261.70 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్ఠ స్థాయి.
రాకేష్‌ ఎంట్రీ
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి పునీత్‌ గోయెంకా వైదొలగడం ఖాయమని వార్తలు రావడంతో ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా 50 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఆయన కొనుగోలు ధర రూ. 220.44. అంటే ఓపెనింగ్‌లోనే ఆయన కొనుగోలు చేశారన్నమాట. రాకేష్‌ ఎంట్రీ మార్కెట్‌కు తెలియడంతో ట్రేడింగ్ ముగిసే వరకు ఈ కౌంటర్‌లో భారీ లావాదేవీలు జరిగాయి. ఒక్క ఎన్‌ఎస్‌ఈలోనే 19 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. వీటిలో చాలా షేర్లు కొని, అమ్మినవి. ఎందుకంటే డెలివరీ తీసుకున్న షేర్ల శాతం 33 శాతమే.