For Money

Business News

17 ఏళ్ళ గరిష్ఠానికి టోకు ధరల సూచీ

దేశ వ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ అధిక స్థాయిల్లో కొనసాగుతూ ఉండటం.. ఇతర ఆహార వస్తువులు, వంటనూనెల ధరలు భారీగా పెరుగుతుండటంతో టోకు ధరల సూచీ 17 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. ఏప్రిల్‌ నెలలో టోకు ధరల సూచీ 15.08 శాతానికి చేరింది. వరుసగా 13వ నెల కూడా టోకు ధరల సూచీ రెండంకెల్లో ఉంది. రాయిటర్స్‌ వార్త సంస్థ నిర్వహించిన సర్వేలో టోకు ధరల సూచీ 14.48 శాతం ఉండొచ్చని అంచనా వేశారు. వాస్తవానికి టోకు ధరల సూచీ అంచనాలకు మించింది. గత ఏడాది ఏప్రిల్‌ నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నె౮లలో ఇంధన ధరలు 38.66 శాతం పెరిగాయి. మార్చిలో ఈ పెరుగుదల 34.52 శాతం ఉండేది. అలాగే డాలర్‌తో రూపాయి విలువ 4 శాతం పడిపోవడంతో కూడా ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టోకు ధరలు సూచీకి అనుగుణంగా రీటైల్‌ వినియోగవస్తువుల ధరల సూచీ కూడా పెరుగుతోందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. రీటైల్‌ వినియోగవస్తువుల ధరల సూచీ ఎనిమిదేళ్ళ గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి చేరిన విషయం తెలిసిందే. తాజా టోకు ధరల సూచీ గణాంకాలను చూస్తుంటే వచ్చే నెలలో ఆర్బీఐ మళ్ళీ రెపో రేటును పెంచే అవకాశాలు అధికమౌతున్నాయి.