For Money

Business News

హౌసింగ్‌ : వడ్డీ రేట్లు ఇంకా పెరిగితే?

అంతర్జాతీయ మార్కెట్లలో వడ్డీ రేట్లు పెరిగినా.. ద్రవ్యోల్బణ రేటు కారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి కుంటుపడుతోంది. అయితే భారత్‌ మార్కెట్‌ చాలా ఆశాజనకంగా కన్పిస్తోందని ప్రముఖ విదేశీ రీసెర్చి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. వడ్డీ రేట్లతో పాటు ఫ్లాట్ల రేట్లు కూడా పెరిగినా.. డిమాండ్‌ స్థిరంగా ఉంది భారత్‌లో. ఇటీవలి కాలంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను 1.5 శాతం పెంచింది. అలాగే గడచిన ఆరు నెలల్లో ఆరు శాతం మేరకు ప్రాపర్టీ ధరలు పెరిగినట్లు సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో భాగంగా ఆర్బీఐ గత మే నుంచి ఇప్పటి వరకు 1.9 శాతం మేర వడ్డీ రేట్లు పెంచింది. రేపు కూడా కనీసం 0.25 లేదా 0.35 శాతం మేర వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది. అయితే ఈ పెంపును మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసినట్లు కన్పిస్తోంది. గత అక్టోబర్‌ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ మహరాష్ట్రలు వడ్డీ రేట్లను 0.15 శాతం నుంచి 0.30 శాతం మేర తగ్గించాయి కూడా. ఎన్‌సీఆర్‌, బెంగళూరు ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ మార్కెట్‌కు మంచి డిమాండ్‌ ఉంటుందని, దీంతో ఈ ప్రాంతాల్లో యాక్టివ్‌గా ఉన్న డీఎల్‌ఎఫ్‌, ప్రిస్టేజ్‌ ఎస్టేట్‌, శోభా షేర్లను కొనుగోలు చేయాల్సిందిగా సీఎల్‌ఎస్‌ఏ సిఫారసు చేస్తోంది. కరోనా తరవాత మాల్‌ అద్దెలు 15 శాతం పెరిగాయని.. అలాగే మాల్స్‌ ఆక్యుపెన్సీ కూడా 95 శాతానికి చేరిందిన సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది.