For Money

Business News

దిగువ స్థాయిలో మద్దతు

ఓపెనింగ్‌లో నష్టాల్లో జారుకున్న నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించింది. టెక్నికల్‌గా నిఫ్టికి 17400 ప్రాంతంలో మద్దతు ఉంది. అదే విధంగా 17429 పాయింట్ల వద్ద మద్దతు అందడంతో అక్కడ నుంచి కోలుకున్న నిఫ్టి క్రమంగా పెరుగుతూ 17667ని తాకింది. దాదాపు 250 పాయింట్లు లాభపడిందన్నమాట. ప్రస్తుతం 17624 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 93 పాయింట్లు లాభపడింది. నిఫ్టి మిడ్‌క్యాప్‌ మినహా మిగిలిన ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టికి ఇవాళ కూడా బ్యాంకులతో పాటు ఫైనాన్షియల్స్‌ నుంచి గట్టి మద్దతు లభించింది. బజాజ్‌ ఫైనాన్స్‌ ఇవాళ 3 శాతం లాభంతో రూ.7491 వద్ద ట్రేడవుతోంది. ఎం అండ్‌ ఎం, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు రెండు శాతంపైగా లాభంతో ఉన్నాయి. అదానీ గ్రూప్‌ షేర్లు ఇవాళ కూడా వెలుగులో ఉన్నాయి. ఇక బ్యాంక్‌ షేర్ల విషయానికొస్తే… మిడ్‌ క్యాప్‌ బ్యాంక్‌ షేర్లలో గట్టి మద్దతు కన్పిస్తోంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లలో మద్దతు కన్పిస్తోంది. బ్రిటన్‌ మార్కెట్లకు ఇవాళ సెలవు. ఇతర యూరో మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా అర శాతంపైగా నష్టాల్లో ఉన్నందున… చివరల్లో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తారేమో చూడాలి.