For Money

Business News

నిన్న డీప్‌సీక్‌… నేడు 910C చిప్‌

అత్యాధునిక ఏఐ చిప్‌లను చైనాకు ఎగుమతి చేయకుండా అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో… చైనా కంపెనీ హువాయ్‌ తెచ్చిన కొత్త చిప్‌ ఇపుడు మార్కెట్‌లో సంచలనం రేపుతోంది. ఎన్‌విడియాకు చెందిన H100చిప్‌కు ప్రత్యామ్నాయంగా హువాయ్‌ అభివృద్ధి చేసిన 910C పనిచేయొచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్‌విడియా చిప్‌లు టెక్నికల్‌గా అభివృద్ధి చేసిన చిప్స్‌ కాగా, హువాయ్‌ తెచ్చిన చిప్‌ ఆర్కిటెక్చరల్‌ విప్లవమని ఏఐ రంగ నిపుణులు అంటున్నారు. ఎన్‌విడియా చిప్‌ల స్థాయిలో హువాయి చిప్‌ లేకున్నా… అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనా కంపెనీలకు ఇది శుభవార్తేనని అంటున్నారు. అసెండ్‌ పేరుతో హువాయ్‌ ఈ చిప్స్‌ను ఇప్పటికే ఎగుమతి చేసిందని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఎన్‌విడియాకు చెందిన H20 చిప్‌లను ఎగుమతి చేయాలంటే కచ్చితంగా తమ నుంచి లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది. చైనాకు అత్యాధునిక చిప్స్‌ అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా ఈ ఆంక్షలు విధించింది. అయితే అమెరికా ఆంక్షల నేపథ్యంలోచైనా కంపెనీలకు హువాయి యాసెండ్‌ చిప్‌ వల్ల చాలా ఉపయోగముందని, తక్కువ రిస్క్‌తో చైనా కంపెనీలు పనిచేయగలవని హర్ష్‌ కుమార్‌ నేతృత్వంలోని పైపర్‌ సాండ్లర్‌ అనలిస్ట్‌ల బృందం పేర్కొన్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. ఇక నుంచి చైనా నుంచి వచ్చే అత్యాధునిక చిప్స్‌తో ఎన్‌విడియాకు కష్టాలు పెరుగుతాయని అనలిస్టులు భావిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో చైనాలో ఎన్‌విడియా కీలక కార్యకలాపాలకు కూడా విఘాతం కల్గుతుందని వీరు అంటున్నారు. అమెరికా ఆంక్షలు కొనే సాగే పక్షంలో… మరింత హైటెక్‌ చిప్స్‌ తయారు చేసే ఛాన్స్‌ హువాయికి దక్కుతుందని వీరు భావిస్తున్నారు.