హైదరాబాద్‌పై ఆసక్తి ఉంది కాని…
హైదరాబాద్ మార్కెట్లో భారీ ఎత్తున ప్రవేశిస్తామని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ పేర్కొంది. హైదరాబాద్‌లో కేవలం ఒకట్రెండ్ కాకుండా… భారీ సంఖ్యలో ప్రాజెక్టులు చేపడతామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజే గోద్రేజ్ తెలిపారు. అయితే తమ ప్రాధాన్యం మాత్రం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూనె మార్కెట్లని ఆయన అన్నారు. ఈ నాలుగు మార్కెట్లలో ఇప్పటికే తమ కంపెనీ భారీ ప్రాజెక్టుకు చేపట్టిందన్నారు. వచ్చే 12-18 నెలల్లో రూ .7,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్త స్థిరాస్తి ప్రాజెక్టుల కొనుగోలు, అభివృద్ధి చేయడానికి ఈ నిధులు వెచ్చిస్తామని పేర్కొన్నారు. లిస్టయిన భారత రియల్ ఎస్టేట్ కంపెనీల్లో గోద్రెజ్ అతి పెద్ద కంపెనీ. అమ్మకాల విషయంలో కాని, భారీ ఎత్తున భూమిని కొనుగోలు చేయడంలో ముందుంటుంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మూడు ప్రధాన ప్రాజెక్టులు చేపట్టామని కంపెనీ పేర్కొంది. కంపెనీకి దాదాపు అప్పులు లేవు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అప్పులు రూ. 313 కోట్లు. డెట్ ఈక్విటీ రేషియ చూస్తే కేవలం 0.04 మాత్రమే. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆల్‌టైమ్ సేల్స్ చూపిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజే గోద్రేజ్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ. 6725 కోట్ల టర్నోవర్ సాధించింది.