మళ్లీ అదే స్థాయి నష్టాలు
ఫెడ్ ఛైర్మన్ పావెల్ ప్రకటనకు స్టాక్ మార్కెట్లు తీవ్రంగా స్పందిస్తున్నాయి. దేశంలో ధరలు బాగా పెరుగుతున్నాయని… వాటిని కట్టడి చేయడమే తన ప్రధాన లక్ష్యమని నిన్న పావెల్ అన్నారు. ద్రవ్యోల్బణ కట్టడి అంటే వడ్డీ రేట్లను పెంచడమే. మే నెలలో అర శాతం వడ్డీని పెంచడంతో పాటు తదుపరి కూడా వెను వెంటనే వడ్డీరేట్లను పెంచుతానని ఆయన అన్నారు. దీంతో నిన్న అమెరికా మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఉదయం ఆసియా, మధ్యాహ్నం యూరప్ మార్కెట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇవాళ రాత్రి మళ్ళీ వాల్‌స్ట్రీట్ అదే స్థాయి నష్టాలతో ట్రేడవుతోంది. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500తోపాటు నాస్‌డాక్ కూడా 1.7 శాతం మేర నష్టపోయాయి. ఇవాళ మార్కెట్‌లో ఆరంభంలో బాండ్ ఈల్డ్స్ తగ్గినట్లే తగ్గి… వెంటనే కోలుకున్నాయి. ఇక కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌కు తిరుగు లేకుండా పోతోంది. డాలర్ ఇండెక్స్ 101ను దాటేసింది. చైనాలో కరోనా దెబ్బకు ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. అలాగే బులియన్ కూడా డల్‌గా ఉంది.