For Money

Business News

గోధుమల సేకరణను తగ్గించిన కేంద్రం?

గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి19వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం గోధమ సేకరణ తగ్గించింది. గత ఏడాది ఇదే కాలంలో కోటి 36 లక్షల టన్నులు గోధుమలను సేకరించగా, ఈ ఏడాది ఇదే కాలంలో 99 లక్షల టన్నుల గోధుమలనే సేకరించింది. అంటే దాదాపు 27 శాతం తక్కువ అన్నమాట. ఈ ఏడాది (2022-23) ప్రభుత్వ అంచనాల ప్రకారం 11.1 కోట్ల టన్నుల గోధుమ ఉత్పత్తి కానుంది. ఉంది. ఇందులో 4.44 కోట్ల టన్నుల గోధుమలను కేంద్రం సేకరించాల్సి ఉంది. అంతర్జాతీయంగా గోధుమల ధరలు జనవరి నుంచి ఇప్పటికి 30 శాతం (గత ఏడాది కాలంతో పోలిస్తే) పెరిగాయి. పైగా ఈసారి ప్రభుత్వం గోధుమల సేకరణను తగ్గించడం వల్ల గోదాముల్లో తక్కువ నిల్వలు ఉండనున్నాయి. పైగా అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్నందున భారీగా ఎగుమతులు చేస్తున్నారు. పైగా ఇంధన ధరలు పెరగడంతో పాటు మార్చి వడగాల్పుల వల్ల పంట ఉత్పత్తి తగ్గనుంది. ఈ కారణాలన్నింటి వల్ల మున్ముందు గోధుమ ధరలు పెరగనున్నాయి. అయినా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం గోధుమలను సేకరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు ప్రైవేట్‌ వ్యక్తులు/ కంపెనీలు భారీగా మార్కెట్‌ నుంచి కొంటున్నాయి. కిలోకు రూ.1.5 నుంచి రూ.2 అధిక ధర చెల్లిస్తున్నారు. అంటే క్వింటాలుకు రూ. 150 నుంచి రూ. 200లు అధికంగా చెల్లిస్తున్నారు. ప్రభుత్వం రేషన్‌ షాపుల్లో ఇచ్చేందుకు 69.24 కోట్ల టన్నుల గోధుమలను సేకరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. మరి బయట మార్కెట్‌లో ధరలు పెరిగితే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం వద్ద స్టాకు ఉండదు కాబట్టి… ప్రైవేట్ వ్యక్తులు/కంపెనీలదే రాజ్యం అవుతుంది. మార్కెట్‌లో ధరలు పెరుగుతాయని తెలిసి… ప్రైవేట్‌ వ్యక్తులకు మద్దతుగా కేంద్రం కొనకుండా వెనకడుగు వేస్తోంది. వెరశి ప్రభుత్వ చర్యల వల్ల మున్ముందు గోధుమ ధరలు మరింత పెరిగే అవకాశముంది.