షేర్ మార్కెట్: పడ్డాయని తొందరపడొద్దు
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు సూపర్ లాభాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించిన నాస్డాక్ 3 శాతం పైగా పెరగ్గా, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.45 శాతం పెరిగింది. ఇక డౌజోన్స్ 1.65 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్లు కోలుకున్నట్లేనని అంటున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను మార్కెట్ డిస్కౌంట్ చేసినట్లేనని అంటున్నారు. పైగా వచ్చే వారం అమెజాన్‌తోపాటు ఆల్ఫాబెట్ వంటి కంపెనీల ఫలితాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రోత్సాహకరంగా ఉంటాయని భావిస్తున్నాయి. అయితే టెక్నికల్‌గా నాస్డాక్ బలహీనంగా ఉందని కొంత మంది అనలిస్టులు అంటున్నారు. బాండ్ ఈల్డ్స్ పెరగడంతోపాటు షేర్లు వ్యాల్యూయేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే నాస్డాక్ మరో 13 శాతం క్షీణిస్తుందని అంటున్నారు.
మన మార్కెట్లో
మనదేశంలో అతి పెద్ద షేర్ బ్రోకింగ్ ప్లాట్ ఫామ్ జీరోద. ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామ్ మాత్రం ఇప్పటికీ మన షేర్ల ధరలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. ఇపుడు షేర్లు తగ్గాయి కదా.. అని కొనుగోలు చేయొద్దని… చాలా షేర్లు తమ వాస్తవ విలువ కన్నా చాలా ఎక్కువ పెరిగాయని ఆయన అంటున్నారు. గత నెల రోజుల్లో నిఫ్టి 16600 నుంచి 17000కు వచ్చిందని.. కాని గత ఏడాదితో పోలిస్తే 8000 పాయింట్లు అంటే 50 శాతం పెరిగిందని అన్నారు. అంటే 100 నుంచి 150 శాతం పెరిగిన సూచీలు కేవలం పది శాతం మాత్రమే క్షీణించిన విషయాన్ని ఇన్వెస్టర్లు గమనించాలని ఆయన సూచించారు. పాత పద్ధతిలో కంపెనీ వాస్తవ విలువను లెక్కగట్టడం ఇన్వెస్టర్లు ప్రారంభించాలని ఆయన అన్నారు. ఇపుడు జీడీపీ 8 శాతం, 9 శాతం పెరిగిందని భావిస్తున్నాం. కాని భారీ పతనం తరవాత ఈ నంబర్లు ఆకర్షణీయంగా కన్పిస్తున్నామని.. వాస్తవానికి మనం ఇంకా పాత స్థాయికి వెళ్ళలేదని ఇన్వెస్టర్లు గుర్తించాలని ఆయన సలహా ఇచ్చారు.