రూ.35లకు వస్తే కొనొచ్చు
జొమాటొ పబ్లిక్ ఇష్యూకు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. లిస్టింగ్ తరవాత ఈ షేర్ రూ. 165 దాటింది. అయితే పబ్లిక్ ఇష్యూ సమయంలో షేర్ల వ్యాల్యూయేషన్ కట్టే విశ్లేషకుడు అశ్వథ్ దామోదరన్… జొమాటొ షేర్ ధర అధికమని.. ఈ షేర్ వాస్తవ విలువ రూ.41లు అని అప్పట్లో పేర్కొన్నారు. భారీ ప్రీమియంతో వచ్చిన ఈ షేర్‌ను కొనేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడటంతో ధర రూ. 169కి చేరింది. అక్కడి నుంచి పతనమౌతూ వచ్చిన ఈ షేర్ రూ.50లపైన చాలా రోజులు ఉంది. అయితే పబ్లిక్ ఇష్యూ సమయంలో షేర్లను కొనుగోలు చేసిన యాంకర్ ఇన్వెస్టర్ల లాక్ ఇన్ పీరియడ్ అయిపోవడతో… వారు ఈ కౌంటర్ నుంచి బయటపడ్డారు. ఈ వారంలో ఈ షేర్‌ను తెగ అమ్మారు. దీంతో ఈ షేర్ ధర రూ.40.60కి పడిపోయింది. జెఫరీస్ వంటి పలు బ్రోకింగ్ సంస్థలు ఈ షేర్‌కు అనుకూలంగా రెకమెండేషన్లు ఇవ్వడంతో ఇవాళ ఈ షేర్ రూ.45.45 వద్ద ట్రేడవుతోంది. జెఫరీస్ ఈ షేర్ టార్గెట్ ధర రూ.100గా పేర్కొంది. ఈ నేపథ్యంలో అశ్వథ్ దామోదరన్ తాజాగా జొమాటొ షేర్ ధరపై తన అంచనాలను ప్రకటించారు. ఈ షేర్ వాస్తవ విలువ రూ.35.32గా పేర్కొన్నారు. మరి ఈ స్థాయిలో షేర్ మద్దతు లభిస్తుందా లేదా అన్నది చూడాలి.