For Money

Business News

డాక్టర్‌ రెడ్డీస్‌కు అమెరికా నుంచి సమన్లు

ఉక్రెయిన్‌తో పాటు ఇతర CIS దేశాలలో డాక్టర్లు వంటి హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌కు లంచాలు ఇచ్చారనే ఆరోపణలకు సంబంధించి అమెరికా న్యాయ విభాగం నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఇలాంటి ఆరోపణలతో వచ్చిన ఆకాశరామన్న ఉత్తరంపై ఇప్పటికే కంపెనీ దర్యాప్తు ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఓ లా సంస్థకు ఈ బాధ్యతను అప్పగించింది. హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌కు ఫార్మా కంపెనీలు లంచాలు వంటి అనధికార చెల్లింపులు చేయడం అమెరికా అవినీతి వ్యతిరేక చట్టాలకు విరుద్ధం. ముఖ్యంగా అమెరికా విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టానికి విరుద్ధం. తాను దర్యాప్తు చేస్తున్న అంశాన్ని కంపెనీ అమెరికా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (SEC), అమెరికా న్యాయ విభాగంతోపాటు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)కి తెలియజేసినట్లు డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఇవాళ వెల్లడించింది. అయితే ఈనెల 6వ తేదీన అమెరికా SEC నుంచి కంపెనీకి సమన్లు వచ్చాయని, CIS దేశాల్లో కంపెనీ లావాదేవీలకు సంబంధించి డేటా అడిగారని కంపెనీ పేర్కొంది. సదరు సమాచారాన్ని పంపుతున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ కేసులో భాగంగా అమెరికా లేదా విదేశాల్లో కంపెనీపై ప్రభుత్వాలు చర్యలు తీసుకునే అవకాశముందని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ పేర్కొంది. అయితే ఆ చర్యలు ఏ మేరకు.. ఎలా ఉంటాయో ఇప్పట్లో చెప్పడం కష్టమని కంపెనీ పేర్కొంది.