ఊబర్, ఓలా విలీనం?
ఉబర్, ఓలా కంపెనీలు విలీనానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నాయని బిజినెస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భావిష్ అగర్వాల్ శాన్ఫ్రాన్సిస్కోలోని ఊబర్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ రెండు కంపెనీల్లో కీలక ఇన్వెస్టర్లలో సాఫ్ట్ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ సూచన మేరకు నాలుగేళ్ళ క్రితం ఈ రెండు కంపెనీలు విలీన చర్చలు జరిపాయి. కాని అవి ఫలవంతం కాలేదు. మరింత అభివృద్ధి సాధించేందుకు రెండు కంపెనీలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటీవల రెండు కంపెనీలు ప్రతినిధులు మళ్ళీ విలీన చర్చలు ప్రారంభించినట్లు ఆ పత్రిక పేర్కొంది. భారత మార్కెట్లో ఈ రెండు కంపెనీలు పరస్సర బాగా పోటీ పడ్డాయి. డ్రైవర్లకు భారీగా ప్రోత్సాహకాలు ఇచ్చాయి. అలాగే ప్యాసింజర్లకు డిస్కౌంట్లు కూడా ఇచ్చాయి. కరోనా తరవాత పరిస్థితులు మారపోయాయి… పోటీకి స్వస్తి చెప్పిన కంపెనీలు ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డాయి. క్విక్ డెలివరీ యాప్ను మూసేయడంతో పాటు సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారినికి ఓలా స్వస్తి పలికింది. ఏడాది క్రితం భారత్లోని తమ కంపెనీని అమ్మాలన్న ఆలోచన ఉండేదని, ఇపుడు లేదని ఊబర్ అంటోంది.