మార్కెట్ అంచనాలకు మిన్నగా…
ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టైటాన్సంస్థ కంపెనీ పనితీరు మార్కెట్ అంచనాలను మించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 34శాతం పెరిగి రూ. 857కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 641కోట్లు. కంపెనీ టర్నోవర్ కూడా 22 శాతం పెరిగి రూ. 8730 కోట్లకు చేరింది. ఈటీ నౌ ఛానల్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న అనలిస్టులు కంపెనీ రూ. 8441 కోట్లఅమ్మకాలపై రూ.729 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. ఈ రెండు అంశాల్లోనూ మార్కెట్ అంచనాలను మించి కంపెనీ ఫలితాలు ప్రకటించింది. నగల వ్యాపారం నుంచి ఆదాయం 18శాతం పెరిగి రూ. 7,203కోట్లకు చేరింది. వాచ్‌లు, వేరెబుల్ బిజినెస్ విభాగం నుంచి వచ్చిన ఆదాయం రూ. 829కోట్లకు చేరింది. ఇక ఐ కేర్ విభాగ వ్యాపారం రూ. 167కోట్లని కంపెనీ తెలిపింది. రానున్న ఆరు నెలల్లో కంపెనీ మరింత మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధిస్తుందని టైటాన్ ఎండీ సీకే వెంకటరామన్ తెలిపారు. ఈ ఏడాదిలో టైటాన్సంస్థ ఇప్పటివరకు 105 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో దేశ వ్యాప్తంగా 382 పట్టణాల్లో కంపెనీకి 2,408 స్టోర్స్ ఉన్నాయి.