For Money

Business News

ఒకే రోజు ముగ్గురు డైరెక్టర్ల రాజీనామా

ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ ఒక సమాచారం అందించింది. తమ కంపెనీలో ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా ఉన్న కమలేష్‌ శివాజి విక్రమ్‌సే, థామస్‌ మాథ్యూ, సంతోష్‌ బి నాయర్‌ రాజీనామా చేసినట్లు పేర్కొంది. ఒకేసారి ఓ ప్రభుత్వ కంపెనీ నుంచి వీరు వైదొలగడంపై స్టాక్‌ మార్కెట్‌లో దుమారం రేగుతోంది. ఎందుకంటే ఈ కంపెనీ నిర్వహణకు సంబంధించి డైరెక్టర్లు పలు ఆరోపణలు చేయడం. కంపెనీ నిర్వహణ, నిబంధనలను పాటించే విషయంలో పీటీసీ ఇండియా అనేక తప్పిదాలు చేసినట్లు వీరు సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌కు తెలిపారు. బోర్డుకు కంపెనీ తగిన సమాచారం అందించడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా నూజివీడు సీడ్స్‌ గ్రూప్‌ కంపెనీ అయిన ఎన్‌ఎస్‌ఎల్‌ నాగపట్నం పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ ఇచ్చిన రూ. 150 కోట్ల రుణంపై వీరు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. రూ. 150 కోట్ల టర్మ్‌ రుణం మంజూరు చేసి అందులో రూ. 125 కోట్లను బ్రిడ్జి లోన్‌గా ఇవ్వడాన్ని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ రుణ వ్యవహారం మొత్తం మోసంగా పేర్కొంటూ స్వతంత్ర డైరెక్టర్లు ఆర్బీఐకి ఫిర్యాదు కూడా చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పీటీసీ ఇండియా సహాయ నిరాకరణ చేసిందని ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు ఆరోపించారు. కంపెనీ గవర్నెన్స్‌కు సంబంధించి అనేక లొసుగులు ఉన్నట్లు వీరు ఆరోపించారు. రుణాలకు సంబంధించిన షరతులను బోర్డు అనుమతి లేకుండానే ఏకపక్షంగా మార్చేశారని వీరు అంటున్నారు. తాము అడిగిన ప్రశ్నలకు అసంపూర్తి, తప్పుడు సమాధానాలను పీటీసీ ఇండియా ఇచ్చిందని వీరు అంటున్నారు.