For Money

Business News

ఈ మూడు రంగాల షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చు

మన స్టాక్‌ మార్కెట్‌ ఆల్‌ టైమ్‌ హైలో ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. దేశీయ ఆర్థిక సంస్థలు కొంటున్నాయి. ఫిక్సెడ్‌ డిపాజిట్లపై వడ్డీ చాలా తక్కువగా ఉండటంతో… స్టాక్‌ మార్కెట్లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నేటి యువత గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించి భారీ ఎత్తున లాభాలు గడించింది. ఇపుడు క్రాస్‌ రోడ్డులో ఉన్నారు ఇన్వెస్టర్లు. లాభాలు స్వీకరించాలా? పెట్టుబడులు కొనసాగించాలా? కొత్త ఏయే రంగాల్లో పెడితే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మార్కెట్‌లో ఆరోగ్యకర కరెక్షన్‌ కోసం ఎదురు చూడమంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. పడినపుడు ఎంటర్‌ కావడం మంచిదని, మున్ముందు మార్కెట్‌కు మంచి రోజులు ఉంటాయంటున్నారు. ఈ సందర్భంగా మూడు రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొచ్చని అంటున్నారు ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్ ఫండ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అయిన ఎ బాలసుబ్రమణియన్‌. ఎకనామిక్ టైమ్స్‌ పత్రికకు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.
ఆయన సూచించిన రంగాల్లో మొదటిది టెక్నాలజీ రంగ. ఇటీవలికాలంలో కంపెనీలు అప్‌గ్రెడేషన్‌ కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన అన్నారు. ఈ పెట్టుబడులు మరింత పెంచాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చని ఆయన చెబుతున్నారు. మరో పదేళ్ళ వరకు కచ్చితంగా టెక్నాలజీపై కంపెనీలు భారీ పెట్టుబడులు పెడతారని సుబ్రమణియన్‌ అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ రంగంలోని కంపెనీలకు భారీగా పెరిగే అవకాశముందని ఆయన అంటున్నారు.
ఇక రెండో రంగం. క్యాపిటల్‌ గూడ్స్‌. గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి క్యాపిటల్‌ రంగంలోపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని… వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ రంగంపై పెట్టుబడి పెట్టక తప్పని పరిస్థితి ఉందని ఆయన అంటున్నారు.కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తంలో చాలా భాగం మౌలిక సుదపాయాల నిర్మాణం కోసం పెడుతున్నారని… కాబట్టి ఈ రంగం కూడా తనకు బుల్లిష్‌గా కన్పిస్తోందని అన్నారు. ఇక మూడోది ఆటో రంగం. గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి కమర్షియల్‌ వాహనాల రంగం చాలా డల్‌గా ఉందని సుబ్రమణియన్‌ అన్నారు. ఈ రంగంలోకి వృద్ధి మళ్ళీ తొందర్లోనే రానుందని ఆయన చెబుతున్నారు. ఆటో రంగంలో ముఖ్యంగా కమర్షియల్‌ వెహికల్స్‌ రంగంలో అభివృద్ధి చాలా బాగుంటుందని ఆయన అంచనా. 2022-2023లో ఈ రంగం  భారీగా వృద్ధి చెందే అవకాశముందని ఆయన అంచనా వేస్తున్నారు. సో… ఈ మూడు రంగాలకు చెందిన షేర్లలో పరిశోధన చేసి మంచి షేర్లను కొనుగోలు చేయడం ఉత్తమం.